పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అళ్లాణరాజుకథ.

277

మహేశ్వరా ! నే నొకదేశమున కధిపతిని మీకామితమే తీర్పఁజాలనా ! మీరు కోరినవస్తువు నాదేశమం దెందున్నను దెచ్చి యీయఁగలను. సందియమందక కోరికొనుఁడు. ఆనియడిగిన నతండు నిట్టార్పు నిగుడించుచు అయ్యో నే నేదియో కోరక మీతో నేను నిజమేమిటికి జెప్పితిని. నాకోరిక కడునీచమైనది. నాప్రారబ్ధమువలన నేఁడు నా కట్టియభిలాష గలిగినది. చెప్పుటకు వాకురాకున్నది. మీ రూరక నన్ను నిర్బంధించుచున్నారు. నాకోరికవిని సీ, సీ, అని నామీఁద నుమియుదు రేమో? అసహ్య మసహ్య మపకీర్తి నేఁ జెప్పుజాలనని చెవులుమూసి కొనియెను.

అప్పుడు రాజు మహాత్మా! నీవు పరమోత్తముఁడవు. మనంబున నొక్కటి వాక్కున నొకటి పెట్టికొని చెప్పుచున్నవాఁడవుకావు. నీహృదయము కడుపరిశుద్ధమైనది. నీకోరిక తీర్పక నేను భూజించువాఁడను కాను. ఇప్పుడు పొద్దుపోయినది. సంశయింపక నీయభీష్ట మెఱిఁగింపుము. ఎంతనీచమైనదైనను నిందింపక యొసంగెదనని బ్రతిమాలికొనియెను.

అప్పుడామహేశ్వరుండు మహారాజా! నన్నుఁ జెప్పుమని గట్టిగా నిర్బంధించుచున్నారు. ఇక చెప్పకతీరదు. వినుండు. ఆహారనిద్రామైధునక్రియలు జంతువులకు సహజములుగదా? నేను బ్రహ్మచారిని. భార్యలేదు. మీరువెట్ట సంతుష్టిగా భుజించితిని. ఇప్పుడు తృతీయ పురుషార్ధము నన్ను గట్టిగా బాధించుచున్నది. మీ రేమికావలయునని యడిగినంత నాచిత్తము సంభోగాయత్తమైనది. ఆమాట యెట్లు చెప్పఁగలను. అది యసభ్యముకాదా? దానిం గప్పిపుచ్చి మఱియొకటి కోరుట కపటమగుచున్నది. ఈకోరిక మీ రెట్లుతీర్పఁగలరు? నాదారి నన్నుఁ బోనిండు. సిగ్గు సిగ్గు మహానుభావులు మీకడ నిట్టితుచ్ఛపుకోరిక కోరినందులకు నాతప్పు మన్నింపుఁడు. అనిపలికిన విని నరంద్రుడు మందహాసము గావించుచు నిట్లనియె.