పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

ఆక్షితిపతి యర్ధాంగలక్ష్మి సువ్రత. ఆపతివ్రత యరుంధతికిఁ దప్పులుపట్టఁగలదు. రూపంబున రతియు విద్యల భారతియు నామెం బోలఁజాలరు. ఆమెసుగుణంబులు వర్ణింప సామాన్యునికి శక్యముగాదు. ఆపుణ్యవతి పతికిఁ బ్రాణములోఁ బ్రాణమై నియమములకు సహకారిణియై వర్తింపుచుండెను.

ఒకనాఁడు పశుపతియను మహేశ్వరుం డతనియింటి కతిథిగా వచ్చెను. అతనిప్రాయము ముప్పదియేండ్లకు లోపుగా నుండును. రూపము సామాన్యమైనను తేజము విద్యావంతుఁడని సూచించుచుండెను. విభూతిరుద్రాక్షమండితప్రతీకుండై రెండవమహేశ్వరునివలె నొప్పుచుండెను. భళ్లాణుం డా పశుపతినిఁ బశుపతిగాఁ దలంచి యథావిధిగా నర్చించి సుఫలము గోరునప్పుడు వాడుకప్రకారము నమస్కరించి యిట్లనియె.

మహాత్మా! నీ వపరశివుండవలె మాయింటికి వచ్చి మమ్ముఁ గృతార్థులఁ గావించితివి. మీపాదరేణువు సోఁకి నేను గులజులతోఁ గూడఁ బవిత్రుండనైతిని. మీ కత్యంతప్రియంబైన కామ్యంబు వక్కాణింపుఁడు. అక్కార్యంబుదీర్చి నంత సుఫలంబు వడసెదనని ప్రార్థించిన విని యామహేశ్వరుం డించుక ధ్యానించి యిట్లనియె.

నరేంద్రా ! కామితంబన మనంబునంబుట్టిన కోరికగదా ? హృదయంబున ననేక సంకల్పములు గలుగుచుండును. వానినన్నియు బయలుపఱచిన వెఱ్ఱివాఁడందురు. ఆసంకల్పములలోఁ గొన్ని పుట్టినతోడనే నశించుచుండును. ఇప్పుడు మీరు నీ కామితమేమని నన్నడిగితిరి. మనంబునఁబుట్టిన యభిలాష మఱుగుపఱచి వేఱొకటి చెప్పుట న్యాయము కాదు. అట్టిదానిం దీర్చినఁగాని, మీవ్రతము సఫలముకానేరదు. ఇప్పుడు నాచిత్తమునంబుట్టిన యభిలాష యొరులతోఁ జెప్పఁదగినదికాదు. కావున మీకు సుఫలమిచ్చెద నా కనుజ్ఞయిండు. పోయివచ్చెదఁ గామ్యముమాట యడుగవలదని పలికినవిని యానృపతిలకుం డిట్లనియె.