పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురందరపురము కథ.

275

కుచుమార గోనర్దీయులతో మిత్రులారా ! మీరిరువురు మహారాజులైరి. మీకతంబున మేము నట్టివారమే యగుదుము. మనమిత్రులు మననిమిత్తమై ధారానగరంబున వేచియుందురు. మీ రందుఁ బోవుఁడు. భైరవుం డేకశిలానగరంబుదెస కరుగుచున్నాఁడని వింటిమి. ఈతండును నేను నందుఁబోయి వానివార్తఁ దెలిసికొని ధారానగరంబున కరుదెంతుము. ఈతఁడు మనకు నెనిమిదవమిత్రుఁడు. తానుగూడ నన్నగరమువచ్చి మనమిత్రులం జూతునని చెప్పుచున్నాఁడు. మనవేడుకలు చూచి చూచి రమ్మనలేక మొగమోటపడుచున్నాఁడు. మే మందుఁబోవుటకు సమ్మతింపుఁడని కోరిన వా రెట్టకే యంగీకరించి రాభోజుండును ఘోటకముఖుండు నటఁగదలి యల్లాణక్షోణిపాలుని పట్టణంబునకుఁ బోయిరి.

అని యెఱింగించి మణిసిద్ధుండు మిగిలినకథ దరువాతిమజిలీ యందుఁ జెప్పదొడంగెను.

163 వ మజిలీ.

అళ్లాణరాజుకథ.

శా. అల్లాణుండను భూమిపాలుఁడు వదాన్యత్వప్రభావంబునన్
     ముల్లోకంబులఁ బేరుపొంది సతతంబున్ శంభుభక్తార్చనా
     సల్లాపంబులఁ ప్రొద్దుపుచ్చుచును సంస్థానంబునం దార్యవి
     ద్వల్లోకంబులు సత్కవుల్ వెలయ నింద్రప్రాభవం బొప్పఁగాన్ .

ఏకశిలానగరంబు రాజధానిగాఁ జేసికొని ధర్మంబునఁ బ్రజలఁ బాలింపుచుండెను. అతనికే భళ్ళానుండను నామాంతరము గలదు. అతఁడు సంతతము మహేశ్వరార్చన సేయుచుండును. సర్వవిద్యాలాలసుండై, కవీంద్రులఁ బండితులఁ బెద్దగా నాదరించును. శిబికర్ణదధీచుల మించినవదాన్యుఁడు నిత్యము పదుగురమహేశ్వరుల నర్చించి యిష్టా పూర్తములచేఁ దృప్తిబొందింపు చుండును. ఏమహేశ్వరుఁ డేదికోరినను నిచ్చుట వ్రతముగా నియమము సేసికొనియెను. -