పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

అని చదివినంత సభ్యులెల్లరు లేచి నిలువంబడి ఆమహానుభావుఁ డేడీ ! కుచుమారుఁ డేడీ ! అని కలకలము చేయమొదలుపెట్టిరి. కొందఱతనిపైఁ బుష్పములు జల్లిరి. హిరణ్యగర్భుఁ డాసంకులము వారింపుచు గోనర్దీయుం గౌఁగిలించుకొని మహాత్మా! మీ రెవ్వరో నే నెఱుంగను. మీకు వర్తమానమైనఁ జేయలేదు. ఆపద్భంధువులై వచ్చి నాయిక్కట్టు బాపితిరి. నిజము దెలియఁజేసితిరి. మీకుఁ గృతజ్ఞుండనై యుండెదను. మీకులశీలనామంబు లెఱింగించి నాకు శ్రోత్రపర్వము గావింపుఁడని వేడుకొనియెను. గోనర్దీయుఁ డిట్లనియె.

రాజా ! మే మేడ్వురము సహాధ్యాయులము. కాశిలో నన్ని విద్యలం జదివితిమని చెప్పితినిగదా ? దిగ్విజయముకొఱకుఁ దలయొకదారిం బోయి దేశాటనము చేయుచుంటిమి. ఇందు మువ్వురము వచ్చితిమి. ఈ సభాధ్యక్షుండు ఘోటకముఖుఁ డొకఁడు నేనొకఁడ నీతఁడు కుచుమారుఁడు నీయల్లుఁడని చూపుచుఁ దమవృత్తాంతము కొంత వివరించెను.

హిరణ్యగర్భుండు మారసన్నిభుండగు కుచుమారుం జూచి సంతోషపారావారనిమగ్నుండై యతనిపాదంబులంబడి మహాపురుషా! రాహుగ్రస్తుండైన సూర్యుండువోలె మఱుంగువడి మాపురాకృతవిశేషంబును జేసి యిప్పుడు మా కాలోకోత్సవము గావించితివి. మేము కృతకృత్యుల మైతిమి. నాపుత్రిక మిమ్ము మునుపే వరించినది. రాజ్యలక్ష్మితోఁగూడ సరస్వతిం బరిగ్రహింపుఁడు అని పలుకుచు నొకపుష్పమాల యతనిమెడలో వైచెను. అప్పు డగ్రాసనాధిపతిగానున్న ఘోటకముఖుఁడు సంతోషము పట్టఁజాలక గద్దియ డిగ్గనురికి మిత్రులారా ! వచ్చితిరా! అని పలుకుచు గోసర్దీయునిఁ గుచుమారునిఁ గౌగిలించుకొని యానందబాష్పములచే వారిం తడిపెను. వారును సంతోషముతోఁ బ్రత్యా శ్లేషము గావించిరి. అప్పుడు గోనర్దీయుఁడు వయస్యా ! నిన్ను మేము గుఱుతుపట్టితిమి. నీవు మ మ్మానవాలు పట్టలేకపోతివి. ఈసందేహము గుఱించి నీ వెట్లుచెప్పెదవో యని మేము నీతో మాట్లాడలేదు. నిజము