పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

గలదా? వినుండు. ఈతఁడు కుచుమారుఁడు కాఁడు. కుక్క కును సింహమునకు నెంతతారతమ్యము గలదో వీనికిఁ గుచుమారునికి నంతతారతమ్యము గలదు. కుచుమారుఁడు మహాపండితుఁడు. నే నెఱుఁగుదు, అతండు నామిత్రుఁడు వానిపేరు వినియే నే నిందు వచ్చితిని. మే మేడ్వురము సహాధ్యాయులము. కాశీలో నొక్కగురువునొద్ద జదివికొంటిమి. (శుకసారికాప్రలాపనం) అనువిద్య మాకుఁగాక యొరులకుఁ దెలియదు. నామిత్రుఁడే రాజపుత్రిక నోడించినమాట వాస్తవము. వీని కీయౌన్నత్వంబు గలుగఁజేయుతలంపుతో నాతఁడు మఱుగుపడి వీని నిట్లుచెప్పుటకుఁ బ్రోత్సహించెనని తలంచెదను. వాని కీయైశ్వర్య మొకలెక్కలోనిది కాదు. వీఁడు వట్టిశుంఠ వీనికడ నేమియు సంస్కారము లేనియట్లు వీనిమాటలే చెప్పుచున్నవి. రాజపుత్రిక బుద్ధిమంతురాలు కావున నిజముగ్రహించి యొడంబడకున్న ది. ఆవిద్వాంసురా లీమూడునిం బెండ్లియాడుట సమంజసముకానేరదు. కుచుమారుఁడే తగినవాఁడు. వాని వెదకి తెప్పించుట యుక్తము. వీఁడు కుచుమారుఁడు కాఁడు కాఁడు అని ముమ్మారు పలికి కూర్చుండెను. అప్పుడు సభ్యులెల్లరు నతని వక్తృత్వ మగ్గించుచుఁ గరతాళములు గొట్టిరి.

తరువాతఁ గోనర్దీయుఁడు లేచి సభ్యులారా ! సభాధ్యక్షుఁడు నిజముదెలిసికొనియెను. సత్యము చెప్పెను. వీఁడు గుచుమారుఁడు కాఁడు మిత్రద్రోహి, కృతఘ్నుండు. మహాపాపాత్ముఁడు. యథార్థము చెప్పెద వినుండు. వీఁడు కుచుమారునితో వంటజేయుటకై వచ్చిన బానిసవాఁడు. వీనిపేరు శంబరుఁడు. ఈదుర్మార్గుఁడు సరస్వతి తన్నుఁ బెండ్లియాడునని యాసజెంది నిద్రించుచుండఁ గుచుమారునితలఁ బెద్దశిలచే నలియఁ గొట్టి కందకములోఁ బారవైచెను అని పలికి కన్నుల నశ్రువులు గ్రమ్మ! గంఠము డగ్గుత్తికబడ సవరించుకొనుచున్నంత ఘోటకముఖుండు ఆఁ! ఏమీ? నామిత్రుండు కుచుమారుఁడు మృతుండయ్యెనా? హా మిత్రమా ! హా వయస్యా ! అని పెద్దయెలుంగున దుఃఖింపుచుండెను. రాజును