పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నేను కుచుమారుండనని ప్రకటించెను. అతఁడు వీఁడుకాఁడని యనుమానముచెంది తిరుగా మఱికొన్ని ప్రశ్నములిచ్చి సమాధానము జెప్పుమని యడిగిన నందుల కితం డొప్పకున్నాఁడు. చిలుకచేతనంపిన ముక్తాదామం బితనియొద్ద నున్నది. కుచుమారుం డతఁడుకాఁడని దాదులు చెప్పుచున్నారు. ఈసందియము మీరే తీర్పవలయునని పలికి రాజు తనపీఠంబునఁ గూరుచుండెను,

అప్పుడు సరస్వతిసఖురా లొకతె నిలువంబడి ఆర్యులారా ! ఈతఁడు చిలుకచేతఁ బ్రసంగింపఁజేసిన కుచుమారుఁడు కాఁడు. ఆతని నేను జూచితిని. వానిరూపలక్షణములు మనోహరములుగా నున్నవి. ఈతఁడే యాతఁడైనచోఁ దిరుగాఁ బ్రశ్నల నడుగ నేమిటికిఁజెప్పకుండెడిని ? మే మిచ్చినప్రశ్నములకు సమాధానము చెప్పించిన నీతని మన్నింతుము. లేకున్న శిక్షింపఁజేయుదు మిదియే మారాజపుత్రిక యభిప్రాయమని చెప్పినది.

తరువాత సభాపతి నీవేమి చెప్పెదవని కపటకుచుమారు నడిగెను. వాఁడు లేచి నిలువంబడి గద్గదస్వరముతో నిట్లనియె. నేను జిలుకకు నావిద్యలన్నియు నుపదేశించితిని. తన్మూలమున సరస్వతి నోడించితిని. దైవికముగా నాచిలుక పిల్లిచేఁ జంపఁబడినది ఆమె నీవే నాభర్తవని యీహారము నాకుఁ బంపినది. గడియగడియకుఁ బరీక్షింపుచుండ నుత్తరము చెప్పుటకు నా కవసరములేదు. వాదమున జయమో యపజయమో యొకసారిగాక పలుమారు గలుగునా? ఇఁక పదింబదిగఁ జెప్పనవసరము లేదు. వారు ప్రకటించినరీతిగా నాసరస్వతి నోడించితిని ఇష్టముండిన బెండ్లిచేయుమనుఁడు లేకుండిన నాకనుమతి నిప్పింపుఁడు నాదారిని నేను బోయెద. తిరుగాఁ బ్రసంగించుట కొడంబడను. ఇదియే నేను జెప్పునది. అని పలికి యూరకుండెను.

సభాపతి — (నవ్వుచు) కుచుమారునిచే నోడింపఁబడితిని. ఈతఁ డాతఁడు కాఁడని రాజపుత్రిక చెప్పుచున్నది. ఇందుల కేమందువు ?