పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురందరపురము కథ.

267

దక్షిణహస్త మెత్తి మహారాజా ! ధర్మసందేహమును గుఱించి వితర్క,మువచ్చినప్పు డెఱిఁగినమాట చెప్పకతీఱదుకదా ? ఘోటకముఖుండను మహాపండితుండు వచ్చియున్నవాఁడు. చతుష్టష్టికళా పాండిత్యము గలిగి యున్న వాఁ డాతఁడే సభాపతిత్వమున కర్హుండని పెద్దకేక పెట్టెను.

హిరణ్యగర్భుండు వారివారిమాటలు విని సభ్యులచే నెన్నఁబడిన వారినందఱను ముందరకు రప్పించి వారిలో నధికవిద్వాంసుఁ డెవ్వఁడో వారినే యేరికొనుమని నిరూపించెను. అందు రత్నకిరీటకటకాది భూషణ భూషితుండగు గోనర్దీయుం జూచియు ఘోటకముఖుండు గుఱుతుపట్ట లేదు. గోనర్దీయుఁడు ఘోటకముఖునిగుఱుతుపట్టి ప్రక్కనున్న కుచుమారుని గోకుచు, అదిగో ఘోటకముఖుండు నన్నుఁ దెలిసికొనలేదు వానికే సభాధిపత్యమిప్పింతము ఎట్లుచెప్పునో చూతుముగాక అని మెల్లఁగాఁ బలికెను. ఎవ్వరు నెవ్వరిని నేరుకొనలేదు. అప్పుడు సరస్వతితండ్రి పూజ్యులారా! మీమహిమ మీకకాక యితరులకుఁ దెలియదు. అఱువది నాలుగువిద్యలు నెఱింగినప్రోడగాని యీసభాధిపత్యము వహింప సమర్థుఁడు కాఁడు. కావున నట్టివారెందఱుండిరో చేతు లెత్తవలయునని పలికిన గోనర్దీయుఁడు ఘోటకముఖుండుమాత్రమే చేతులెత్తిరి.

వారిద్దఱిలో నెవ్వని నధ్యక్షునిగాఁ జేయవలయునోయనియాలోచింపుచుండ గోనర్దీయుఁడు ఘోటకముఖుండే సమర్థుండని చేయెత్తి చెప్పెను. ఎల్లరు కరతాళములు వాయించిరి. రాజు లేచివచ్చి ఘోటకముఖునిమెడలోఁ బుష్పమాలికవైచి యగ్రపీఠమునఁ గూర్చుండఁబెట్టెను.

అప్పుడు హిరణ్యగర్భుండు అయ్యా ! వినుఁడు. సరస్వతి నా కూఁతురు. విద్యలలో నామెను జయించినవానికి వివాహముచేయుదునని ప్రకటించితిని. కుచుమారుండను బ్రాహ్మణకుమారుండు వచ్చి చిలుక చేతనే నాకూఁతు నోడించెనఁట. ఆమె వానివిద్యాపాటవమునకు మెచ్చికొని చిలుకచేతనే ముత్యాలహారముపంపి నీవే నాభర్తవని తెలియఁజేసినదఁట. తరువాత నాశుకము మార్జారభక్షితమైన దనిచెప్పి యాతఁడు