పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

కొనుచు సభజేయుసమయము దెలిసికొని సభాకార్యదర్శియొద్దకుఁ బోయి పండితులమని చెప్పి యనుమతిపత్రికలం దీసికొని (టిక్కెట్టు) ముందుగనే సభకుఁ బోయి యొకచోటఁ గూర్చుండిరి.

ఆసభాభవనము సుధర్మవలెఁ గమనీయరత్నవితానకల్పితసోపానములచే విరాజిల్లుచున్నది. క్రమోన్నతమగు పీఠ శ్రేణులచే (గేలరీలు) నొప్పుచు వేలకొలఁదిజనులు కూర్చుండుటకుఁ దావుగలిగియున్నది. క్రమంబున విద్వాంసులు విద్వత్ప్రభువులు పౌరులు ప్రేక్షకులు వేనవేలు వచ్చి సభ నలంకరించిరి. సభాభవనమంతయు జనులచే నిండింపఁబడి చిత్రితంబో యన నిశ్శబ్దంబై యుండెను.

అప్పుడు సరస్వతితండ్రియగు హిరణ్యగర్భుండు సమున్నతవిశాలంబగు నగ్రవేదికపై నిలువంబడి యెల్లరు విన నుచ్చస్వరంబున నిట్లుపన్యశించెను. సభ్యులారా ! నాకొక ధర్మసందేహము గలిగి దానిం దీర్చుకొనుటకై మిమ్మునెల్ల రావించితిని. నాయందు దయయుంచి మీరెల్ల విచ్చేసినందులకు మీయెడ నేను గృతజ్ఞుఁడ నయ్యెద. మఱియుఁ జతుష్టష్టికళావిశారదుఁడగు భోజమహారాజుగారి నీసభాధ్యక్షునిగాఁ జేయఁదలంచి వారికి వర్తమానము సేసితిని. వారు గ్రామాంతర మరిగినట్లు వార్తవచ్చినది. కాళిదాసమహాకవియు నిప్పు డాభోజునియాస్థానమున లేఁడనియు నల్లాణభూపతియొద్ద నున్నాఁడని తెలియవచ్చుటచే నక్కడికి దూతలం బుచ్చితిని. ఆమహాకవి రాఁజాలనని తెలియపఱచెను. ఇప్పు డీసభాధ్యక్షు నెన్నుకొనవలసియున్నది. అందులకు సమర్ధుఁ డెవ్వఁడో తెలియదు. సభాసదులే యట్టిసమర్థుని నిరూపింపవలయును. అతండు సెప్పినట్లు నడుచుకొనువారమని పలికి యొకపీఠంబునఁ గూర్చుండెను.

అప్పుడు కొందఱు విద్వాంసులు లేచి అయ్యా ! గోనర్దీయుండను మహారాజు గొప్పవిద్వాంసుఁడు. అఱువదినాలుగువిద్యలు నేర్చిన ప్రోడ. భోజునికన్న నధికుండు. ఆక్షితిపతిని సభాధ్యక్షునిగాఁ జేయుఁడని చెప్పిరి. మఱికొందఱు మఱియొకనిఁ బేర్కొనిరి. అప్పుడు భోజుఁడు లేచి