పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురందరపురము కథ.

265

తముల నెవ్వఁడు గ్రహింపఁగలడు ?

మఱియొకఁడు - నిజముగాఁ గాళిదాసేవచ్చినచో నిజము బయల్పడకపోవునా? ఆమహాకవిని గుఱించి యనేకకథలు చెప్పుకొనుచుందురు. ఈకుచుమారునిమూలమున నాపుణ్యపురుషుల దర్శనము కలుగు చున్నదిగదా !

అని మాటలాడుకొనుచు నాపురుషులు నిష్క్రమించిరి. వారి మాటలు విని భోజుండు ఆహా ! మహానుభావుఁడగు కాళిదాసునిమూలమున నాపేరుగూడ వాడుక పడినది. అట్టియుత్తముని నవమానపఱచిన నాపాపమునకు నిష్కృతి గలదా ? అందులకే యిట్లిడుములం గుడుచుచున్నాను. ఇఁక గాళిదాసకవి యుండు నెల వరయవలయునని యాలోచించుకొనుచు ఘోటకముఖుంజూచి ఆర్యా ! నీ వాపురుషులతో నేదియో మాటలాడుచుంటివి. విశేషము లేమైనం దెలిసినవియా? అని యడిగిన నతం డిట్లనియె.

కుచుమారుండు నామిత్రుఁడని మీ కెఱింగించితినికదా? అతం డఱువదినాలుగువిద్యలు వచ్చినప్రోడ సరస్వతి నతఁడే జయించెను. చిలుకచేత వాదము చేయించెనఁట. ఆవిద్య మాకుఁగాక యొరులకు రాదు. అతం డేమయ్యనో తెలియదు. మఱియొకఁడువచ్చి నేనే కుచుమారుండనని చెప్పుచున్నాఁడఁట. అఱువదినాలుగువిద్యలు భోజునకు వచ్చునని కాళిదాసకవితోఁగూడ రమ్మని వార్తల నంపిరఁట, వారు వత్తురఁట. ఆవింత మనముగూడఁ జూడవలసినదే. ఆమాటలే వారు నాతోఁ జెప్పు చున్నారని పలికెను.

భోజుండు విషాదమేదురహృదయుండై వా రెక్కడవత్తురు ? వీరికంటె వారు గొప్పవారా ఏమి ? అదియట్లుండె మీరుకూడ పండితులేకదా ? ధర్మనిర్ణయము సేయునప్పుడు మీరును గొంతభారము వహింపవలసినదే. పోవుదము పదుఁడు అని ప్రబోధించెను.

అని వారిద్దఱు ముచ్చటించుకొనుచుఁ బట్టణవిశేషములఁ జూచి