పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వే̃ఱొకఁడు - అతండు కుచుమారుఁడు కాడని యెవ్వరు నిర్థారణచేయఁగలరు?

ఒకఁడు – నిర్ధాణకొఱకు కాదే యీసభజరగుచున్నది.

ఇంకొకఁడు - గొప్ప గొప్ప మహారాజులు విద్వాంసులు చాల మంది వచ్చిరి. తిరిగి పరీక్షించుట కొడంబడి విజయమందినచో జామాతయే లేనిచో ప్రేతయే యగును.

ఒకఁడు - అఱువదినాలుగువిద్యలయందుఁ బరిచయము గలిగిన భోజమహారాజు సరస్వతియపరావ తారమైన కాళిదాసకవితో వచ్చి యీసభాధిపత్యము వహించునఁట. నిజము తేలకుండునా ?

మఱియొకఁడు — ఏమీ? భోజమహారాజే అగ్రాసనాధిపతి ? కాళిదాసకవికూడ వచ్చునా ? ఆహా ! ఆమహాసభ చూడవలసినదే. చోటు దొరకదేమో ముందుగాఁ బోవలయును.

ఇంకొకఁడు — చోటా ? భూమండలమందలి జనులందఱు వచ్చినను సరిపడును. మహారాజుగారు మంచియేర్పాటు చేయించిరి. ఆసభాభవనము మనపట్టణమంత యున్నది. ఎందుగూర్చుండినను సమముగాఁ గనంబడును.

మఱియొకఁడు. -భోజుఁడును గాళిదాసకవియు వచ్చినచో నీపాటికిఁ దత్ప్రభ పట్టణమంతయు వ్యాపింపకుండునా? ఆమాట యెవ్వరును జెప్పుకొనుటలేదేమి ?

ఒకఁడు వారు సభాసమయమునాఁటికిఁ దిన్నగా సభకే వత్తురు. ముందుగా వచ్చి కూర్చుందురా యేమి?

మఱియొకఁడు - ఎట్లైనను ముందుగాఁబోయి యామహనీయుల దర్శనముసేసి కృతార్థులమగుదుముగాక.

ఒఁకడు -- ఇందలి నిజ మేమనియెదరు ? ఈరాజపుత్రిక విభూతిరాయనిఁ బతిగాఁ బడయ నిష్టములేక యట్లనుచున్నదేమో? స్త్రీలచేష్టి