పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టాపథసత్రము కథ.

263

ముల వ్యాకులపెట్టుచున్నాఁడు అని మల్లిక చెప్పినది.

ఆనాలుగుశ్లోకములలో మల్లిక చేసినశ్లోకమే చాల రసవంతముగా నున్నదనితలంచి భోజుండు దాని కక్షరలక్ష లిచ్చుటకు మనంబున నిశ్చయించి యెల్లరు విన మల్లికను బెద్దగాఁ బొగడి మేము కొలఁదిదినములలో ధారానగరము వత్తుమనియు నప్పుడు తిరుగా దర్శనము చేయుదుమని చెప్పి బ్రహ్మదత్తుని యనుజ్ఞపుచ్చుకొని భోజుండు ఘోటకముఖునితోఁగూడఁ బురందరపురమున కరిగెను.

బ్రహ్మదత్తుండు కుటుంబముతో ధారానగరంబునకుఁ బోయెను. అని యెఱింగించి యవ్వలికథ మఱల నిట్లు చెప్పదొడంగెను.

162 వ మజిలీ.

−♦ పురందరపురము. ♦−

పురందరనగరాధీశ్వరుండగు హిరణ్యగర్భుండు ధర్మసందేహమొండుతీర్పదలంచికొని సుప్రసిద్ధులగు పండితులను బండితప్రభువులను రమ్మని యాహ్వానపత్రికలు వ్రాయించెను. సభాదివసంబునకు నానా దేశములనుండి రాజులు కవిరాజులు తమతమ బిరుదములతో వచ్చి పురము నిండించిరి. దానంజేసి యాపట్టణ మప్పుడు బహుజనాకీర్ణమై రథహస్తి పత్తిసంకులంబై భేరీపటహవేణువీణాది మంగళవాద్యముఖరితంబై యొప్పుచుండెను.

భోజుండును ఘోటకముఖుండును దైవికముగా నాఁటికే యవ్వీటికిం బోయిరి. వీధులలో జనులు గుంపులుగుంపులుగా మూగికొని సరస్వతిమాటలం జెప్పుకొనుచుండిరి. కొందఱు కుచుమారుని గుఱించి ముచ్చటింపుచుండిరి. ఒకచోటఁ గొందఱు శృంగారపురుషులు సరస్వతీవివాహమును గుఱించి యిట్లు సంభాషించిరి.

ఒకఁడు - నేఁటితో నేదోయొకటి తేలఁగలదు. అతండు జామాతయో ప్రేతయో కాఁగలఁదు.