పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

రు మాచారాయణునికిఁ బిల్లనిచ్చితిరా ? అట్లైన మాకునుం బూజ్యలే. నే నామిత్రులలో నొక్కరుఁడను. నాపేరు ఘోటకముఖుఁడందురు. నామిత్రులందఱు నీపాటికి ధారానగరము చేరియుందురు. నాకు దారిలోఁ గొన్నివిఘ్నములు తటస్థించినవి. అందులకై క్రుమ్మఱుచుంటిని. ఒకమహానీయునిభార్యను భైరవుండనువాఁడు హరించెను. వానినిమిత్తము తిరుగుచుంటిని. వాఁడిప్పుడు పురందరపురమున నున్నట్లు వార్తలు దెలిసినవి. మే మందుఁ బోగలము. మీరు తిన్నగా ధారానగరమున కరుగుఁడు. అందఱు నందుఁ గనంబడుదురని తనకథ నెఱింగించెను.

బ్రహ్మదత్తుండు ఘోటకముఖుం గౌఁగిలించుకొని ఆర్యా ! నీమాట చారాయణుఁ డెఱింగించియుండెను. నీవు గనంబడుటచే సగము విచారము వోయినది. నీమిత్రునిభార్యను జూతువుగాని రమ్ము. సర్వదా అతని నిమిత్తము విచారించుచుండునని పలుకుచు నతనిచేయిపట్టుకొని తనగదియొద్దకుఁ దీసికొనిపోయి పుత్రికతో నాతనిచారిత్ర మెఱింగించెను. మల్లిక ప్రీతిసూచకములగు చూపులచే నతనిం జూచుచు సిగ్గు పెంపున నేమియు మాటాడినదికాదు.

తదాకారలక్షణంబులు పరీక్షించి సంతసించుచు నామె యేమైనం జదివికొన్న దా? అని యడిగెను. నీమిత్రుఁడు చదువుపరీక్షించియే చేసికొనెనని యతం డుత్తరముజెప్పెను. పిమ్మట ఘోటకముఖుండు బ్రహ్మదత్తుని దనగదియొద్దకుఁ దీసికొనిపోయి భోజుంజూపుచు నీయుదారుని దార నరయుటకై తిరుగుచుంటిమని చెప్పుచు భోజునితో బ్రహ్మదత్తుని వృత్తాంత మెఱింగించెను.

అతండు భోజుండని ఘోటకముఖునికే తెలియనప్పు డితరుల కెట్లుతెలియును. బ్రహ్మదత్తుండు గొప్పపండితుఁడు కవియని విని భోజుండు లేచి నమస్కరించె. అతని రూపలక్షణంబులు పరీక్షించి యెవ్వఁడోయొక దేశాధికారియని నిశ్చయించి తగిన ట్లాశీర్వదించెను. ఆరాత్రి