పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మాటలం జెప్పుకొనుచుండిరి. బ్రహ్మదత్తుండు వారిమాట లాలించుచు నోరగాఁ గూర్చుండెను. ఒకతార్కికునకు కవికి నిట్టి సంవాదము జరిగినది,

తార్కికుఁడు — కవీంద్రా ! నీవు ధారానగరంబునుండి వచ్చితినని చెప్పితివికదా, భోజుండు కవికల్పభూజుండని చెప్పుదురు. ఆ వదాన్యుండు కుశలియై యున్నవాఁడా ? కవీంద్రులనేకాక పండితులగూడ సత్కరించునా ?

కవి - ఆరాజిప్పు డాయూరలేడు. కుపితుండై యరిగిన కాళిదాస కవిం దీసికొనివచ్చుటకై విదేశమున కరిగెననిచెప్పిరి. ఆయనకుమారుఁడు విద్యాంసుల నాదరించుచున్నాఁడు కాని పరీక్షలు లేవు. మీరేమైనఁ గవిత్వము సెప్పఁగలరా?

తార్కికుడు - ప్రౌఢముగాఁ జెప్పలేను. అలవాటుచేయుచున్నాను. అబ్బా ! అది సహజముగానుండ వలయునుగాని బలవంతముచేసిన విరసముగా నుండును. ఒకచరణము మాదిరిగా రెండవది కుదరదు. నే నొకశ్లోకము రచించితిని విందురా ?

కవి - ఇప్పుడు నిద్రవచ్చుచున్నది. రేపు వినియెదనులెండి. మఱి యేవేని విశేషములు చెప్పుదురు.

తార్కి - శ్లోకము వినుటకు నిద్రవచ్చుచున్నదా? విశేషములకు నిద్రరాదూ? పోనిండట్లె చెప్పెదవినుండు. పురందరపురవిశేషములు వింటిరా?

కవి - ఆరాజుకూఁతురు సరస్వతిమాటయేనా? ఆమెకడ మీ తార్కికములు నాకవిత్వము నిలువవు. ప్రతిపండితుఁడు నామెకు మ్రొక్కవలసినదె. ఆవిశేషము చెప్పనక్కఱలేదు.

తార్కి - అయినది. వినుండు. కుచుమారుండనుపండితుఁ డామె నన్నివిద్యలలో నోడించి పెండ్లిచేయమనుచున్నాఁడు.

కవి - అందులకుఁ బ్రార్థనయేటికి ? ఆమె యట్టిప్రకటనమే