పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టాపథసత్రము కథ.

257

మల్లిక యామాటవిని తండ్రీ! మేముమాత్ర మొకసారి దేశవిశేషములఁ జూడఁగూడదా ? కూపస్థకూర్మమువలె నెల్లకాల మీయడవి నడుమ వసింపవలయునా ? మమ్ముగూడఁ దీసికొనిపొండు అని బ్రతిమాలికొన్నది. అతం డంగీకరించి శుభముహూర్తంబునఁ గుటుంబముతో బయలుదేరి ధారానగరము మాళవదేశమందున్నదని తెలిసికొని యా దిక్కుగాఁ బోవుచుఁ గొన్నిదినంబుల కష్టాపథసత్రము జేరికొనియెను.

−♦ అష్టాపథసత్రము కథ. ♦−

ఒకమహారణ్యమధ్యంబున నెనిమిదిదిక్కులనుండి వచ్చిన మార్గములు గలిసికొనినవి. అందొక పుణ్యాత్ముండు గొప్పసత్రమును గట్టించెను. దాని కష్టాపథసత్రమని పేరువచ్చినది. అందలిభూమి తృణకాష్టజలసమృద్ధిగలిగి మధురరసఫలకుసుమదళబహుళములగు తరులతా గుల్మాదులచే నొప్పుచున్న యారామములచే మనోహరమై యున్నది. ఆసత్రమునకు మూఁడుయోజనముల దూరములో గ్రామమేదియును లేదు. పాషాణకంటకదుర్గంబగు మార్గములచే వెలయుచున్నది. బాటసారులు మిక్కిలి దూరమునడిచివచ్చి యందు గొన్ని దినములుండి విశ్రాంతివహింతురు. అందు నాలుగువర్ణములవారికి భోజనసదుపాయములు చేయుదురు. ఏఁబదియాఱుదేశములవారు నాసత్రమున. గూడి యుందురు. అన్ని భాషలు నన్ని దేశవిశేషములు నందు వినంబడుచుండును.

బ్రహ్మదత్తుం డాసత్రములోఁ గుటుంబముతో నొకగదిలోఁ బ్రవేశించెను. సత్రాధికారులు వారికిఁదగిన సదుపాయములు సేయుచుండిరి. సత్రాధిపతిం బొగడుచు ధర్మకర్తల నగ్గించుచు నుద్యోగస్థుల స్తుతియించుచు బ్రహ్మదత్తుండు కుటుంబముతోఁ గొన్నిదినము లందుండి దేశ విశేషములం దెలిసికొనెను.

ఒకనాఁడురాత్రి పండువెన్నెలలు గాయుచుండెను. బ్రాహ్మణు లెల్లరు భుజించి సత్రముముందరి విశాలవితర్దికలపైఁ గూర్చుండి వింత