పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యాదరించిన మహానుభావునిఁ జంపుట కాక్రూరాత్ముని కెట్లుచేతులు వచ్చెనో తెలియదు. సీ, సీ, అట్టివానిపేరు దలంచుటయు మహాపాతకమే. కథాసందర్భంబునఁ జెప్పవలసివచ్చె. గోపా ! వినుము. ఆసిద్ధుని పాటుజూచి యందున్నమృగములన్నియుఁ గన్నీరుగార్చుచు బైరవునకు వెఱచి దూరదూరముగా మూగికొనుచుఁ గొన్ని చారాయణుఁడున్న తటాకమునకు గుంపులుగాఁబోయి యేదియో మొఱ్ఱవెట్టుకొనుచున్న ట్లాక్రోశించినవి. ఆక్రొత్తవింతజూచి చారాయణుఁడు మది దిగులుదోప మృగములయార్పుల కేదియో కారణమున్నదని నిశ్చయించి నిత్యకృత్యములు సాంతముగాఁ దీర్చికొనుటకు మనసురాక తటాలునలేచి పర్ణశాలకుఁబోయి మోడ్పుచేతులతో నేలంజాగిలిబడి బ్రహ్మరంధ్రంబు పగిలి రక్తప్రవాహము గారుచుండ దీర్ఘనిద్రాముద్రితనయనుండై యున్న యాయతిసత్తముం జూచి గుండె గుభాలు మన జేతనున్న కమండలువు జాఱవిడిచి హా ! గురువరా ! హా! కారుణికోత్తమా ! హా తపోనిధానా ! అని పలుకుచు నేలంబడిపోయి మూర్ఛిల్లెను. పెద్దతడవున కొడలుదెలిసి యతని మేనిపయింబడి మహాత్మా ! నిన్నిట్లు చంపినవాఁడెవ్వఁడు? తండ్రీ ! నీ వజాతశత్రుండవే నీ వెవ్వరి కపకారముచేసితివి ? నీప్రభావంబున మృగము లన్యోన్యవైరంబులు విడిచి యూడిగంబులు సేయుచుండ నీయం దీసుబూనిన పాపాత్ముం డెవ్వఁడు ? 'బాబూ ! నీయుపన్యాసము వినిన నమృత మసహ్యమగుచుండునుగదా ! అయ్యో ! నీచావు గన్నులార చూచితిని నే నెంతపాపాత్ముండనో ? చిరకాలము బ్రదికి చివర కిట్లు బలవన్మరణమునొందితివేమి సామీ ! మొన్న నేదియో ప్రస్తావములో నే నిఁక నెంతకాలమో బ్రతుకను. నీకు వశిత్వాదివిద్య లుపదేశించెద ననిచెప్పితి వింతలోఁ జావుమూడునని యనుకొనలేదు తండ్రీ ! హా ! సిద్ధప్రవరా ! కారుణ్యనిధీ ! తపస్వరూపా ! ఒకసారి నాతో మాటాడుము. నాదెసఁజూడుము. అవసానోపదేశము సేయవా? ఆహా! మహా