పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారాయణుని కథ.

251

చెను. అప్పుడు నాకు స్మృతివచ్చినది. ఆబాలిక నాకు విసరుచుండెను. అప్పుడు నే నాయనకు నమస్కరించుచు నన్ను బ్రతికించినందునకుఁ గృతజ్ఞత సూచించితిని.

ఆయజమానుఁ డడుగ మెల్లఁగా నావృత్తాంతమంతయుం జెప్పితిని. అతఁడు మిగులసంతసించుచు నన్ను లోపలికిం దీసికొనిపోయి మృష్టాన్నములచే సంతృప్తుంగావించెను పదిదినము లందు నాకు రాజోపచారములు గావించిరి. దేహమున బలముగలిగి యథాప్రకారముగా నొప్పుచుంటిని.

ఆబ్రాహ్మణునిపేరు బ్రహ్మదత్తుఁడు. చతుశ్శాస్త్రపారంగతుండై యొకమహారాజువలన నాగ్రామ మగ్రహారముగాఁగైకొని యందువసించి భూమి ఫలపతియగుట సకలసస్యములు ఫలింపఁజేయు చుండెను. తోటలునాటి కేదారములుగట్టి కాలువలు త్రవ్వించి యాభూమినంతయు బాగుచేయించెను. ఆబాలిక యాబ్రహ్మదత్తునికూఁతురు. దాని పేరు మల్లిక. ఆపారునకు వేఱొకపనిలేమిం జేసి యాకన్నియకు సంతతము విద్యలు గఱపుచుండును. అప్పటికి తర్క వ్యాకరణములయందుఁ బాండిత్యము గలిగినది. కవిత్వము చెప్పఁగలదు. సంగీతము పాడఁగలదు.

ఒకనాఁడు బ్రహ్మదత్తుఁ డాచిన్న దానిచే శాస్త్రములలో నన్నుఁ గొన్నిప్రశ్నల నడిగించెను నాపాండిత్యము దెలిసికొనవలయునని యడిగినట్లు గ్రహించి యాప్రశ్నలకు సమాధానము చెప్పుచు నాకుఁగల విద్యాపాటవమంతయుఁ దేటపఱచితిని. బ్రహ్మదత్తుఁడు నాపాండిత్యమున కక్కజమందుచు నన్నుఁ బెద్దగాస్తుతించి నన్నామల్లికను బెండ్లిచేసికొమ్మని ప్రార్థించెను సిరిరావలదనువాఁడుండునా ? నేను సంతోషముతో నంగీకరించితిని. ఒకశుభముహూర్తంబున బ్రహ్మదత్తుండు మల్లికను నాకిచ్చి మహావైభవముతో వివాహముగావించెను. కొన్నిదినము లందుండి మిత్రులవృత్తాంతము సెప్పి ధారానగరంబునకుఁ బయనమైతిని.