పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

రుఁ డాసరసిదరికరుదెంచి సిద్ధేంద్రా ! పాహి పాహి మృగేభ్యః పాహి అని యాక్రోశించెను. మాబైషీః ఏహి ఏహి అని సిద్ధుండు ప్రత్యుత్తర మిచ్చెను. ఆభాష భైరవున కేమియుం దెలిసినదికాదు. నీ వెవ్వఁడవు? ఏమిటీకివచ్చితివి ? పో, పొమ్ము. ఇది రహస్యస్థలము పామరు లిందుండ రాదనిపలికిన విని యతండు బెదురుగదుర నయ్యో! నేను బ్రాహ్మణుఁడ విద్వాంసుఁడ ధారానగరమున కరుగుచు దారితప్పివచ్చితిని. శరణుజొచ్చితిని. తపోధనులకుమాత్రము భూతదయ యుండవలదా మీరహస్యమునకు నేనేమియు భంగము గలుగఁజేయఁజాలను. మృగములకు వెఱచు చున్నాను. రక్షింపుఁడు. అని వేఁడికొనియెను. అప్పుడు సిద్ధుండు రమ్ము భయములేదు. అని హస్తసంజ్ఞ గావించెను. ఆవిప్రకుమారుం డల్లన తటాకముదాపునకుఁ బోయి భైరవునకు సిద్ధునకు సమస్కరించి యోరగా నిలువంబడి వారి జపావసాన మరయుచుండెను.

అనంతర మాయతి కన్నులందెఱచి కమండులూదకము పూరించి యావిప్రకుమారునితోఁగూడ బైరవుండు వెంటరాఁ బర్ణశాలకరిగి ఫలాహారములచే వారిం దృప్తులంగావించెను. తరువాత వాడుకప్రకారము మృగములకుఁ బ్రసాదము పంచిపెట్టెను. ఆవింతయంతయుఁ గన్నులారఁ జూచి బ్రాహ్మణపుత్రుఁడు తపోమహత్వమునకు మిక్కిలి యక్కజపడఁజొచ్చెను.

తనప్రక్క వినమ్రుఁడై కూర్చున్న యాచిన్నవానింజూచి సిద్ధుండు వత్సా ! నీదేయూరు ? ఎందుఁబోవుచుంటివి? నీవృత్తాంత మెఱింగింపుమని యడిగిన నతఁడు మొగంబున భయభక్తి విశ్వాసములఁ బ్రసరింపఁజేయుచు మహాత్మా! భవదీయకటాక్షవీక్షణంబుల నాపై వ్యాపింపఁజేయుటం జేసి నేను బవిత్రుండనైతి. నావృత్తాంతము చెప్పి నాచరిత్రనుగూడఁ బవిత్రముచేసికొనెద నాలింపుఁడు.

___________