పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

బడినవి. సిద్ధుండు స్నానముసేసి మధ్యాహ్నికక్రియలు నిర్వర్తింపుచుండ భైరవుండును దీర్థమాడి యేదియో జపించుచున్నట్లు ముక్కు బట్టికొని గొణుగుచుండెను.

క్రియావసానంబున సిద్ధుండు కమండులువున జలంబెక్కించికొని బయలుదేఱెను. భైరవుఁడును జపము ముగించికొనినట్లుగా నడిపి యాయనవెంట నడుచుచుండెను. మృగములు గింకరులవలె లేచి ముందు నడుచుచుండెను. యతీశ్వరుఁడు పర్ణశాలలోఁ బ్రవేశించినంత మృగములు పరివేష్టించి కూర్చున్నవి. తరువాత నయ్యోగి తదానీతంబులగు పదార్థంబులు భైరవునకుఁ గొన్నియిచ్చి తాను భజించి శేషము మృగములకుఁ బంచిపెట్టెను.

ప్రసాదమువలె నామృగము లొక్కటొక్కటిగావచ్చి స్వీకరించి పోవునవి. యతితో నాఁడు భైరవుఁ డిష్టాలాపములాడికొనుచు సుఖముగా వెళ్ళించెను. మఱునాఁడు భైరవుఁడు యతీశ్వరునిఁజూచి సామీ! అన్నిటికంటెఁ బ్రాణములు చాలతీపుసుఁడీ ! నాకు భార్యాపుత్రాదులు లేరు శుద్ధవిరక్తుండ నిట్టినాకును జావనిన భీతిగలుగుచున్నది. ఒరుల మాట చెప్పనేల? వినుండు. నేను జపంబునకై కన్నుమూసినంత నీమృగములు నాపైఁబడి చంపునని వెఱపుగలుగుచున్నది. మీకడ నిజముదాచ నేల ? జప మేమియుం దోచకున్నది. ఇంతకన్న వేఱొక ప్రతిరోధ మేదియు నిందులేదు. ఇందుల కేదియేని ప్రతిక్రియఁ దెలియఁజెప్పుఁడని వేఁడుకొనుటయు నాసిద్ధుండు,

ఓయీ! నీవిందులకుఁ జింతింపకుము. నాకుంబోలె నీకుఁగూడ మృగములన్నియు వశములై యుండునట్లు తంత్ర మొకం డెఱింగించెదఁ బరిగ్రహింపుము. తద్వేతృత్వంబున మనుష్యుల మృగములఁజేయవచ్చును, మృగములు తొత్తులవలె స్వాయత్తములై పనులు గావింపఁగలవని పలుకుచు వానిదుర్వృత్తిందెలిసికొనలేక యాప్రక్రియ వానికెఱిగించెను.