పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిద్ధునికథ.

245

శైలములు నాచూడనితీర్థములు నరణ్యములులేవు. బదరీవనంబుననుండఁగా నందలితాపసులు మీయుదంత మెఱింగింప సంతసముతో బయలుదేరి యాఱుమాసములకు నతికష్టముమీఁద మిమ్ముఁ బొడఁగంటిని కృతార్థుండనైతి. ఇఁక నా కీజన్మమునకుఁ గావలసినదేదియును లేదు. ఆజన్మాంతము మీశుశ్రూషచేయుచు మీపాదమూలమున దేహము చాలించెద నట్టివరంబు నాకుఁ బ్రసాదింపవలయును.

ఆహా ! మీమహానుభావత్వ మీసత్వంబులసేవయే ప్రకటించుచున్న ది. ఇట్టివింత యెందును జూచియెఱుంగనని యాసిద్ధునిఁ బెద్దగా నుతియించుటయుఁ గాపట్యమెఱుంగని యమ్మహాత్ముఁడు వాని కభయ హస్తమిచ్చుచు నోయీ ! ముముక్షుండవగు నీ విందుండుట కేమియు నభ్యంతరములేదు. నీయిష్టమువడువునఁ దపంబుసేసికొనుచుఁ గాలము గడుపుము. నేను స్నానముసేయఁ దటాకంబున కరుగుచున్నవాఁడ. అల్లదే పర్ణశాల యందుఁబోయి కూర్చుండుము. నేను రెండుగడియలలో వచ్చెదననిపలికిన విని వాఁడు సామీ ! నేనెంత విరక్తుండనైనను మృగములఁజూచిన నాహృదయము బెదరుచున్నది. ఎంతబోధించినను గుదురుపడకున్నది. మీసాన్నిధ్యంబుననుండఁబట్టి గట్టిగా మాట్లాడఁగలిగితిని కాని లేకున్న నోటినుండి మాటయేరానేరదు. దారిలో మృగసంఘము నుండి తప్పించుకొని వచ్చితిని. ఇందున్న క్రూరమృగములు నన్ను మ్రింగునని వెఱపుగలుగుచున్నది. మిమ్మువిడిచి నేనొంటిగాఁ బర్ణశాల కేగఁ జాలనని పలికిన నవ్వుచు యతి యిట్లనియె.

అడవులు పెక్కు తిరిగితినని చెప్పితివే? ఇంతపిరికివాఁడ వెట్లుపోయితివి. ఇందు మృగములు నిన్నేమియుఁ జేయవు. విస్రంభముగా సంచరింపుము. స్నానముచేయుదువుగాక - నాతోఁ దటాకమునకు రమ్ము. వెఱపుడిగింతునని పలుకుచు వాని వెంటఁబెట్టికొని తటాకంబునకుఁ బోయెను. మృగంబు లాయతి ననుగమి౦చి యరిగి కాసారతీరంబున నిలువం