పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నాదంబు వినంబడినది. భైరవుం డాదెసఁ గన్నులెత్తి చూచుచుండెను.

గీ. భూతిరుద్రాక్షమాలికాభూషితాంగుఁ
    డురుజటాంచితమస్తకుం డొక్క సిద్ధ
    యతివరుండు కమండలూద్యత్కరుండు
    జపము చాలించి యప్పర్ణశాలనుండి.

స్నానార్థము బయలువెడలి తటాకంబున కరుగుచుండ మృగ తండంబులెల్ల ముందునడుచుచుండె. వృక్షశాఖాంతరమునుండి యవ్వింత జూచి భైరవుండు నెఱపుడిపికొనుచు సాహసముచేసి యాసిద్ధుండు తానున్న చెట్టుక్రిందుగాఁ బోవుచున్నసమయంబునఁ దటాలున నేలకురికి పిరికితనంబున నతనిపాదంబులంబడి మహాత్మా! రక్షింపుము. రక్షింపుము. అని మొఱవెట్టికొనియెను.

దయాహృదయుండగు నయ్యతీశ్వరుండు వానిం గరుణావిలోకనంబుల నీక్షించుచు నీ వెవ్వండవు? ఎందుండివచ్చితివి ? నీయుదంత మెఱింగింపుమని యడిగిన భైరవుం డల్లనలేచి యిట్లనియె.

మహాత్మా ! నావృత్తాంత మాలింపుఁడు. గిరితటంబను నగ్రహారము నాకాపురము. నాపేరు గౌతముఁడందురు. నాతలిదండ్రులు చిన్ననాఁడే గతించిరి. దిక్కుమాలినవాఁడనై నే నక్కడక్కడ సంచరించుచు బ్రాహ్మణునికి విధాయకములైన విద్య లభ్యసించి వైరాగ్యప్రవృత్తితోఁ దిరుగుచుంటిని. ధసవిహీనుండనగుటయు నా కెవ్వరు బిల్లనిచ్చిరి కారు. అదియే నావైరాగ్యమును బలపఱచినది. నన్నందఱు బైరాగియని పిలువమొదలుపెట్టిరి. క్రమంబున నాకాపేరే రూఢియైనది. నేను బుట్టు బ్రహ్మచారినగుట యధావిధి బ్రహ్మచర్యవ్రతంబు చేయుచుఁ దీర్థయాత్రల సేవించుచు మహాత్ముల దర్శించుచు దేహయాత్ర నడుపుచుంటిని.

నాచిత్తము విరక్తిఁ జెందియున్నది. ఎప్పుడును మీవంటి తపోధనుల నాశ్రయించి సేవింప నుత్సుకత్వము గలిగియుందును. నాచూడని