పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిర్యగ్జంతుమహాసభ.

239

పవలయునని మేకలు చెప్పినవిని గొఱ్రెలు నట్లు చెప్పినవి. పిమ్మట నేనుఁగులు లేచి,

మహారాజా ! నీరూపము మేము కలలోఁజూచినఁ బ్రాణములు విడుతుము. అట్టినీవు దాక్షిణ్యమూని మమ్మురప్పించి మీపక్షమేమని యడిగిన మేము ప్రతిపక్షులఁజేరుదుమా? మేము పెద్దదేహము గలిగియు బుద్ధిమాంద్యముచే మనుష్యులకు లొంగియుంటిమి. మాకాహారము వారిడనక్కఱలేదు అడవి రొట్టదిని జీవింపఁగలము. నల్లమందువైచి మాబుద్ధిని మందపఱచుచున్నారు. మనుష్యులు మాకు శత్రువులుగాని మిత్రులుగారు. అవశ్యము వారిఁ బరిభవింపవలసినదే యని యేనుఁగులు పలికినవి. హర్యక్షంబు:

గీ. ఒడలు తోమిత్రోమి కడిగి కాళులువంచి
   పిసిగి పిసిగి దువ్వి ప్రీతిజనులు
   హరుల నాదరింతు రది హేతువుగ నవి
   మనలఁ జేరవేమొ యనుఁడు హరులు.

నిలువంబడి సింహంబునకు మ్రొక్కుచు నిట్లుచెప్పినవి. మృగ ప్రభూ ! మనుష్యులు మాకుఁజేయు నుపచారములన్నియు వారిపనులం జేయించికొనుటకు గాని మాయందలి యనుగ్రహమువలనఁగాదు. మనుష్యులు మమ్ము బండ్లకు గట్టియు బరువుమోయించియుఁ బొలముల దున్నించియు నెద్దులకన్న బెద్దగా బాధించుచున్నారు. మఱియు మమ్మాడుగుఱ్ఱము మొగము జూడనీయక సర్వదాకట్టిపెట్టి మాచే బ్రహ్మచర్యవ్రతంబు సేయించుచున్నారు. ఇంతకన్న నపకారమేమియున్నది? మేమడవిలో గడ్డి తిని బ్రదుకగలము. మనుష్యులపై మాకు జాలి లేదు. పరిభవించుటయే మాయభిప్రాయమని యశ్వములు పలికినవి. ఖరములు నుష్ట్రములు నట్లే నరులయెడ ద్వేషము సూచించినవి.

లేళ్ళు పందులు మేకలవలెఁ దమ బలవన్మరణముగుఱించి దుః