పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

లకుఁగూడఁ దమశాసనం బెఱిఁగించితిమి. ఆయాదేశంబులంగల మృగంబులెల్ల సంతసించుచు నేఁ డిటకుఁ దమతమ ప్రతినిధుల నంపినవి. కాని సిద్ధాశ్రమమందున్న మృగముయొక్కటియు నిక్కడికి రాలేదు.

మేము బిలువఁబోయినప్పుడే సిద్ధునియానతి లేనిదె మాకు మా యడవిదాటి పో వశముకాదని చెప్పియున్న వి. తక్కినదేశములనుండి సత్వంబులన్నియు వచ్చియున్నవని యెఱింగించి కూర్చున్నవి.

అప్పుడు మృగరాజు లేచి యిట్లుపన్యసించినది. మిత్రులారా ! మనమందఱము నేఁ డిటకు సమావేశముమగుటకుఁ బ్రోత్సాహము గావించిన యీజంబుకంబుల నభినందించుచున్నాను. వినుండు. సృష్టికర్త యొక్కఁడే సర్వాధికుండు. సృష్టింపఁబడిన జంతువులన్నియు వానివాని బుద్ధిబలంబునంజేసి న్యూనాధిక్యములు వహింపుచున్నవి. మనుష్యులవలెనే మనము సృజింపఁబడితిమి. కాని వారు మనల సృజింపలేదు. వారు మిగుల బుద్ధిబలము గలవారగుట మనలమించి భౌతికసృష్టిలో వారే ప్రధానుల మనిపించుకొనుచు మనలో లొంగనివానిఁ జంపుచు లొంగిన వానిచేఁ బనులఁ గావించుకొనుచున్నారు.

మనలో సామాన్యజంతువునకుగలశక్తి వారిలో నూర్వురకు లేదు. నూర్వురఁ గాళ్లక్రిందవైచి చీమలవలె నలుపు సామర్థ్యముగల యేనుఁగులు ఒక్కనికి లొంగి తొత్తువలెఁ బనులుచేయుచున్నవి. ఇంతకన్నఁ జిత్ర మేదియైనం గలదా ? ఇఁక గుఱ్ఱములు నెద్దులు మేకలు లోనగు జంతువులమాటఁ జెప్పనవసరములేదు. ఇందుకుఁ గారణము మన బుద్ధిమాంద్యము, పరస్పరవైరము. మనుష్యులఁ జూచి మనము నేర్చికొనవలసిన విషయము పరస్పరమైత్రియే. ఒక మనుష్యుఁడు మఱియొకమనుష్యుని జంపిన గొప్పయపరాధముకదా? మనలో నెలుకను బిల్లియుఁ బిల్లిని గుక్కయు లేళ్లను దోడేళ్లు నావులఁ బులులును భక్షింపఁ జూచుచుండును. జాతివైషమ్యము విడిచి యైకమత్యముగా మెలంగినచో నొక