పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మహావిద్వాంసుండు స్వకీయనిరవద్యవిద్యాసంపత్తి నుంకువగా నిచ్చి పురందరపురాధిపతికూఁతురు సరస్వతిని వివాహమాడుచున్నాఁడు. అను వార్తఁ బండితులవలన విని అట్టికళాప్రవీణుఁడవు నీవేయని నిశ్చయించికొని సంతసముతో నాయుత్సవముఁ జూడఁ బయలుదేరి యందుఁ బోవుచుంటిని. ఇందే నీవు గనంబడితివి. అదియే పదివేలు. అని గోనర్దీయుఁడు తన వృత్తాంతమంతయుఁ గుచుమారుని కెఱింగించుచు మిత్రమా! ఈరాజ్యము నాయొక్కనిదే కాదు మనమేడ్వురము పంచికొనవలసినవారమే. మనమిత్రు లీపాటికి ధారానగరము చేరియుందురేమో? మన మిప్పు డందుఁ బోవలయునా ? కర్తవ్య మేమి ? అని యడిగినఁ గుచుమారుం డిట్లనియె.

వయస్యా ! తొలుతం బురందరపురమున కరిగి యందలివిశేషము లేమియో తెలిసికొని తరువాత ధారానగరంబున కరుగుదము అని చెప్పిన నతం డొప్పుకొని యప్పుడే యారేవుగుత్తజేసినవర్తకుని రప్పించి కుచుమారుని కిచ్చినవిత్తమునకుఁ బదిరె ట్లతనికిచ్చి సంతోషపఱచెను.

తరువాతఁ గుచుమారుని వెంటఁబెట్టికొని చతురంగబలపరివృతుండై గోనర్దీయుఁడు ఆరేవు దాటి తొలుత బెస్తలున్న పల్లె కరిగి బలములనెల్ల దూరముగా నుండనియమించి కుచుమారుని కైదండఁగొని యాపల్లెవాండ్రవెంబడి సంచరించుచు వారినెల్ల రప్పించి యాయాగుఱుతులు చూచుచు,

సీ. నెత్తిపైఁ గట్టిన నెత్తుట జొత్తిల్లు
              మరకగుడ్డలఁ జూచి పరితపించె
    పరిఘాంబువులనుండి పైకిఁదీసిన మేటి
              జాలంబు గని యశ్రుజలము విడిచె
    నొడలెఱుంగకయున్న యెడఁ బండుకొనఁబెట్టు
              నులకమంచముఁ జూచి కలక జెందె