పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదయంతికథ.

225

అతండు అయ్యో ! నాజన్మావధిలో నిట్టిభూతమును జూచి యెఱుంగను. నూఱ్వురము మండలముదినములు మహామంత్రములు జపించి తంత్రములు తీర్చితిమి. వాని నించుకయు గణించినదికాదు. నాగాయ మొకలెక్కా ? ఒకమాంత్రికుని శిరముపై గ్రుద్దినది. తలంచికొనిన నిట్టిబాధలోఁగూడ నవ్వువచ్చుచున్నది. ఆమాంత్రికుఁడు దెబ్బ దినిన కుక్కవలె నఱచుచు ముక్కునుండి రక్తముగార నీవలకుఁ బారిపోయివచ్చెను. ఒకని గుండెకాయకండలు పీకినది. వారిద్దఱు చావుబ్రదుకులమీఁద నున్నారు. ఇఁక భూతవైద్యులమని పేరుపెట్టుకొనినవాఁ డెవ్వఁడు నందుఁ బోవఁడు. పాప మారాజుగారుమాపరాభవమునకుఁజాల వగచుచున్నారు. ఆచిన్నదానిప్రాణములు దీయక యాభూతము వదలదు.

ఆభూతమును నదల్చి యాచిన్నదానిని నిరామయం జేసినవానికే రాజ్యముతోఁగూడ నాచేడియ నిచ్చి వివాహముగావింతునని తిరుగాఁ బ్రకటించినారఁట. అభూతమును బ్రహ్మదేవుఁడు వదల్చలేఁడు. రాజ్యము కాదు మూఁడులోకములిచ్చినను నసాధ్యమైనపని యెవ్వరుసేయఁగలరు? అని యాభూతవైద్యుఁ డచ్చటివృత్తాంతము క్రమ్మఱ నెఱింగించెను.

అయ్యుదంతము విని నిరంతరసంతోషభూషితస్వాంతుండనై యటఁగదలి కతిపయప్రయాణంబుల జయపురంబున కరిగితిని. మిత్రమా! అప్పు డాపట్టణమంతయుఁ బాడుపడినట్లున్న ది. ఎవ్వడును గడుపునిండఁ గుడుచుటలేదు. గృహము లలంకారశూన్యములై యున్నవి. ఎవరికివారే యాయాపద తమకువచ్చినట్లుగా విచారించుచుండిరి. లేచినతోడనే పౌరులెల్లఁ గోటలోనికిఁబోయి రాజుగారితోపాటు విచారించుచు సాయంకాలమున కింటికి వచ్చుచుండిరి. నృపతియు రాజ్యకార్యము లేమియు విచారింపక సంతతము పుత్రికారోగనివారణోపాయమే యాలోచించు చుండెను. నేను గ్రామమంతయుఁ దిరిగితిరిగి కోటసింహద్వారమునొద్దకుఁ బోయితిని. అందొకచో నీప్రకటనపత్రిక వ్రాయఁబడి యున్నది.