పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

చించి నలువదిదినములు నారసింహము జ్వాలాముఖి ఉగ్రభైరవము బాలాబగళాముఖి మొదలైనమంత్రములు జపించుచుఁ బద్మములు మ్రుగ్గులుపెట్టి హోమములు సేసిరఁట. తరువాత నొకదినమున భూతోచ్చాటనము చేయుటకు నిశ్చయించుకొని యక్కుటిలకుంతలకు జటవేయుటకై పదుగురుమాంత్రికులు సాహసించి తలుపుతీసికొని హుం పటుస్వాహా మారయ మారయ, ఛింది ఛింది అని యుచ్చరించుచు నాచిన్నదియున్న గదిలోనికిఁ బోయిరఁట. వారిలో మాతండ్రిగారు మొదటివాఁడు.

బాబూ ! ఇఁకఁ జెప్ప నేమియున్నది. ఆభూతముగూడ మారయ మారయ తాడయ తాడయ ఛింది ఛింది హుంపటుస్వాహా- అని కొందఱం జఱచినది. కొందఱం గీరినది. కొందఱం జీరినది. అప్పుడు మాంత్రికులు మొఱ్ఱోయని యఱచుచుఁ గాయములెల్ల గాయములుపడి రక్తముగారఁ దలుపులువైచి యీవలఁబడువఱకు బ్రహ్మాండమైనది. వారిలో మాతండ్రిగారితొడఁ గఱచినది. కండ లూడివచ్చి పెద్దగాయముపడి రక్తముగారుచుండెను. జ్వరము వచ్చినది. మూఁడుదినము లొడ లెఱుంగక మంచముపైఁ బడియుండిరఁట. ఇతరమాంత్రికులును మంచముపట్టిరఁట. వారియవస్థఁజూచి యెల్లవారు నవ్వఁజొచ్చిరఁట, మాతండ్రిగారికి బాధ యెక్కువైనందున సవారిపై నెక్కించి మాయింటికిఁ బంపివైచిరి. నేఁటికి మూడులంఘనములు.

ఆయు శ్శేషముండుటచే బ్రదికిరి కాని యది చావవలసినగాయమే. పెద్దపులియైన నంతలోతుగాఁ గఱవలేదు. ఆకుందరదన కాశక్తి యెట్లువచ్చినదో తెలియదు. అని యాభూతవృత్తాంతమంతయుం జెప్పెను.

నే నాకథ విని మిక్కిలి వేడుకచెందుచు భుజించినవెనుక గది లోనికిం బోయి యాభూతవైద్యుం జూచితిని. ఊరక మూల్గుచుండెను. గాయము. మానుపట్టినదికాని చాలలోతుగా దిగియున్నది. తిరుగా నే నాయనతో నచ్చటివిశేషము లేమని యడిగితిని.