పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదయంతికథ.

223

సమయంబున మఱియొక్క బ్రాహ్మణుం డరుదెంచి నాతో భుజించుచున్న గృహమేధిం జూచి ఓయీ ! నీతండ్రిగారు జయపురమునుండి వచ్చిరా? ఏమిజరిగినది ? భూతోచ్చాటనము గావించిరా? కానుక లందివచ్చిరా? అనియడిగిన నతండు కానుకలవలెనేయున్నది చావుదప్పించుకొని వచ్చి మాకన్నులం బడియెను. అదియే పదివేలు. ఆయన నేఁటికి మూఁడులంఘణములు. ఆగదిలోఁ బండికొనియున్నారు. చూడుము అని చెప్పెను.

ఆమాటలు విని నేను అయ్యా ! భూతోచ్చాటన మనుచున్నా రదేమి ? ఎందలివార్త ? అనియడిగిన నాగృహమేధి యిట్లనియె. ఈదేశమునకు రాజధాని జయపురము. అప్పురాధిపతికి మదయంతియను కూఁతు రొక్కతియే చిరకాలమునకుఁ గలిగినది. ఆచిన్నది రూపంబునను విద్యలను శీలమునను మిక్కిలి పేరుపొందియున్నది. సమారూఢ యౌవనయై సానబట్టినరత్నమువలె మెఱయుచున్న యాతరుణీరత్నమునకు వివాహము చేయవలయునని తండ్రి ప్రయత్నించి నానాదేశరాజకుమారుల చిత్రఫలకములఁ దెప్పించుచుండెను.

అదియట్లుండ రెండునెలలక్రిందట నయ్యిందువదన నిద్రబోవుచుండ భూతమో బ్రహ్మరాక్షసుఁడో తెలియదు. ఆమెమీఁదఁబడి యావేశించెనఁట. అదిమొద లమ్మదవతి నిద్రబోవదు. ఆహారము తినదు. ఊరక కేకలుపెట్టుచుఁ గనంబడినవారినెల్ల వెఱ్ఱికుక్కవోలెఁ గఱచుచు గీరుచు బాధింపఁదొడంగినదఁట.

కొన్నిదినములు గదలకుండ నదిమిపట్టికొనుచుండిరఁట. మఱికొన్నిదినములు పట్టుకొనలేక కట్టిపెట్టిరి. అందులకును వశముగాకున్న నొకగదిలోఁ బెట్టి తలుపువైచి కాచుచుండిరఁట. ఆభూత మెంతగట్టిదో తెలియదు. ఆరాజు పుడమింగల మాంత్రికులనెల్ల రప్పించెను. మా తండ్రిగారు భూతవైద్యములోఁ బేరుపొందియుండిరి; ఆయనకుఁగూడ వర్తమానమురాఁగా నక్కడికి వెళ్లిరి. మాంత్రికులందఱు కలిసి యాలో