పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవభూతికథ.

221

ఉత్తమబ్రాహ్మణుని జంపినపాతక మూరకపోవునా ? మా వెంటఁ దరిమికొనివచ్చినది. కొంతదూరము పోయినంతఁ గృతాంతకికరులవంటి తస్కరులుకొంద రెదురై మమ్ము నదలించిరి. నేను బెదరక మూటలీయక వారి నెదిరించితిని. వారిలో నొకఁడు గుడ్డుకర్రతో నానెత్తి పఠేలుమన బ్రద్దలుగొట్టి చంపి చంద్రముఖిని చేరఁదీసికొనిపోయెను.

అప్పుడు నాకు బ్రహ్మహత్యాపాతకము ప్రత్యక్షమై నన్నా వేశించి బ్రహ్మరాక్షసుని గావించినది. నేను జంద్రముఖితో ననుభవించినసుఖంబు కడుస్వల్పము. మహాత్మా ! నరమృగపశుపక్షిసలిలరహితమగు నీయరణ్యమున క్షుత్పిపాసలు బాధింపఁ బెద్దకాలము బాధపడితిని. పడుచుంటిని. నేనుబడిన యిడుము లిట్టివని చెప్పుటకు శక్యములు కావు. మహావిద్వాంసుఁడవగు నీదర్శనము చేయుటచే నా కీపూర్వోదంతమంతయు నేఁడు జ్ఞాపకమువచ్చినది. ఇదియే నావృత్తాంతమని యెఱింగించుటయు నేను విస్మయముజెందుచు భూతేంద్రా ! పారదారికక్రియ యం దట్టిశక్తి యున్నది. నీవుకాదు ఎవ్వరైన నాసమయమం దట్లు కావించితీరుదురు. అని యుత్తరము జెప్పితిని.

అప్పు డాభూతపతి ఆర్యా ! నీవు నావలన విద్యలు గ్రహింపవలయుననిగదా వచ్చితివి ? నీ కేవిద్య రాదో చెప్పికొనఁదగినవిద్య యేదియో పేర్కొనుము. అని యడిగిన నేను మహాత్మా ! అది మీరే చెప్పవలయును. నేను జదివినవిద్య లివియని వానినెల్లఁ బేర్కొంటిని. అప్పు డతం డురముపైఁ జేయివైచుకొని ఔరా ! నీవెంతవాఁడవు ! నయమే నిన్నుఁగూడ భక్షించితినికాను. ఇంతకన్నఁ బెద్దపాప మనుభవింపవలసి వచ్చును. ఆహా ! నీపాండిత్యము ! నీకువచ్చిన విద్యలలో నాకు సగమైన రావే ? నేను నీ కేవిద్య జెప్పఁగలను ? అని నన్ను మెచ్చికొనుచుగోనర్దీయా ! నీకొక మహోపకారము సేసి నేను గృతకృత్యుఁడఁగాదలంచికొంటిని. నీదర్శనమువలన నీయరణ్యము దాటి దేశసంచారము సేయు