పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నే నంగీకరించితిని. అప్పుడు చంద్రముఖి మఱియొకమాటఁ జెప్పినది.

నాభర్త బ్రదికియున్న చో గ్రామస్థుల వెంటఁబెట్టుకొని మనవెంట దఱిమికొనివచ్చి మనలం బట్టించి రట్టుజేయఁగలఁడు. కావున వానిం గడతేర్చిపోవుటయే లెస్స. మన కేయాటంకము నుండదని చెప్పిన నే నొప్పికొని యప్పని యెట్లుసేయవలయునని యడిగితిని. నేఁ జెప్పెదనుకాదా? అని యొకనాఁటిరాత్రి భర్తను నిద్రబుచ్చి నాయొద్దకు వచ్చి మనోహరా! ఇదేసమయము; గాఢనిద్ర బోవుచున్నాఁడు. తల్లి దూరముగానున్నది. కత్తి తీసికొనిరమ్మని యుపదేశించినది. ఆహా ! మోహావేశ మెట్టిదో విచారింపుము.

గీ. తల్లిఁ దండ్రి నన్నఁ దమ్మునిఁ బుత్రుని
    ప్రాణనాథు నెట్టిబంధువైన
    జారవాంఛజేసి చంపుదు రంగనల్
    వృజినమునకు నింత వెఱవ రెపుడు.

సకలవిద్యలు జదివిన నేనై న నించుక వివేకించితినా ? ఎల్లకాల మట్లే యుండుననుకొంటిని. సీ! కామాంధులకు యుక్తాయుక్తవివేక మించుకయు నుండదు. చంద్రముఖి యట్లుచెప్పినంతనే నూరియుంచిన కత్తిదీసికొని దానివెంట వారింటికింబోయి నిద్రావ్యామోహంబున నొడ లెఱుంగక గుఱ్ఱుపట్టుచున్న యాశ్రోత్రియబ్రాహ్మణుని కంఠముపై నొక్కవ్రేటువేసి గతాసుం జేసితిని. చీ, చీ, నావంటిపాపాత్ముం డెందైనం గలఁడా? అట్లు వానింజంపి చంద్రముఖిం గ్రుచ్చియెత్తి ముద్దాడుచు ప్రేయసీ ! మనకంటకము వదలినది మన మిఁక పోవచ్చును. లెమ్ము, లెమ్ము. వస్తువులు సవరించియుంచితిగదా ! అని పలికితిని.

అది యంతకుముందే ప్రయాణమైయున్నది. అప్పుడు మే మిద్దఱము నొరులకుఁ దెలియకుండ నగలు మూటఁగట్టికొని యాచీఁకటిలో నిల్లువిడిచి యూరు దాటి యుత్తరాభిముఖముగాఁ బోవఁదొడంగితిమి.