పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవభూతికథ.

219

మెలఁగుచుండ గ్రామమంతయు హల్లకల్లోలముగాఁ జెప్పికొనుచుండిరి.

ఒకనాఁడు చంద్రముఖి రాత్రి మాయింటికి వచ్చి తిరుగా నింటికి పోయినదికాదు. పోకుంటివేమని యడిగిన మనోహరా! నామగఁడు వేదజడుఁడు. అతనిమాట యటుండనిండు. నాయత్తగారును బంధువులును బెట్టురట్టునకు మేఱలేదు. వచ్చినరట్టు రానేవచ్చినది. ఇఁక రహస్య మేమియును లేదు. వ్రతముచెడినను సుఖము దక్కవలయును. పగలుమాత్రము మిమ్ము విడిచియుండనేల ? ఇఁక నే నింటికిఁ బోవను. ఇందే యుండెదనని చెప్పిన నే నంగీకరించితిని.

మఱునాఁడు వాడుకప్రకారము వారింటికిఁ బోలేదు. జాముప్రొద్దెక్కినది. వంటవేళ మిగిలినది. దానియత్తగారు మాయింటికివచ్చి నా భార్యతోఁ జంద్రముఖి మీయింట నున్న దా ? అనియడిగిన లోపలగదిలో నున్నదని సంజ్ఞ చేసినది. లోపలికివచ్చి నాకడనున్న చంద్రముఖిం జూచి ఏమేరండా ! నీవింత సిగ్గువిడిచి సంచరించుచుంటివి ? కాపురము వదలుకొంటివా ? అని యేమేమో దుర్భాషలాడినది.

చంద్రముఖి నాకుఁ గాపురమక్కఱలేదు. ఇఁక మీయింటికి రాను. మఱియొకకోడలినిఁ జేసికొమ్ము. అని మూఁడేమాటలు చెప్పి యూరకొన్నది. అప్పు డామె పోయి కాపును గరణమును వెంటఁబెట్టికొనివచ్చి యిది నీకు నీతికాదని నాకుఁ జెప్పించినది. పదుగు రేకమైవచ్చిన నే నేమి సేయుదును? అధికారులమాట ద్రోయలేక చంద్రముఖిఁ జెప్పి బలవంతమున వారింటి కనిపితిని. చెప్పిపెట్టినబుద్ధి యెంతవఱకు నిలుచును ? మఱియొకనాఁడు చంద్రముఖి నాయొద్దకువచ్చి మనోహరా ! ఈగ్రామస్థులందఱు నాలోచించుకొని మనల శిక్షింపఁజూచుచున్నారఁట. మనమిఁక నిందుండిన మాటదక్కదు. మనము విదేశమునకు లేచిపోయిన హాయిగా సుఖింపవచ్చును. ఏరట్టును గలుగదని బోధించిన నందులకు