పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వేళ మంచిదికాదు. చెడుదారింబడితిని నడుమ దండకారణ్యములే కాని మంచి జనపదం బొక్కటియుఁ గనంబడలేదు. ఇది యేదేశమో తెలియదు. ఈదారి యెక్కడికిఁబోవునో చెప్పువారులేరు. యక్షశాప ప్రవృత్తి యెట్లు పరిణమించునో యెఱుగను తనశాపం బమోఘమని యతండానతిచ్చి యున్నవాఁడు ఆయూరికిఁబోవకున్నఁ దప్పునా ? కానిమ్ము కానున్నది కాకనూనదు. అని యాలోచించుచు మార్గము దెసఁ దనచూపులు వ్యాపింపజేసెను.

అప్పు డామార్గములో నేదియోమృగము దనదెసకుఁ బరుగెత్తికొని వచ్చుచున్నట్లు కనంబడినది. జడియుచు నతం డాచెట్టుపైకెక్కి కొమ్మలసందున నణగి యుండెను. అంతలో జీనుగట్టినగుఱ్ఱమొకటి వచ్చి యాచెట్టుక్రిందనే నిలువంబడినది. దానినిఁజూచి దత్తుండు సంతోషాయత్తచిత్తుఁడై ఔరా ! దీని నడవిమెకమనుకొని జడిసితిని. కల్యాణ లక్షణోపేతమగు నీవీతి యేనృపసూతిదో కావలయును. అనర్ఘములగు కనకమణినికరములచే నలంకరింపఁబడియున్నది. ఇది ఖలీనము ద్రెంచికొని పారిపోయి వచ్చినది. ఈప్రాంతమందేదియో నగరమున్న దికాఁబోలు అని తలంచుచు మెల్లన నాచెట్టుదిగి యాగుఱ్ఱమును మచ్చికచేసి జూలుదువ్వుచు మోమున వ్రేలగట్టిన బంగరుపట్టికం బరీక్షించి రుక్మిణియను విలాసముండుట తెలిసికొని యక్కజమందుచు నిదిస్త్రీలెక్కు తత్తడి యందుల కే జీను విలక్షణముగా నున్నది. ఏది యేమైనను నడువలేక బడలియున్న నాకీయశ్వమును సర్వేశ్వరుఁ డే తెచ్చియిచ్చెను. దీనినెక్కి యెక్కడికో పోయెద నేదియోయొకటి కాఁగలదని నిశ్చయించి క్రిందికి వ్రేలాడుచున్న కళ్ళెముపట్టుకొని వీపుపైఁ జరచుటయు నదికదలక బెదరక త్రోక నాడించుచు సకిలించినది -

అతండది శుభసూచకమని తలంచి ఱివ్వుననెగసి దానిపై కెక్కి