పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవభూతికథ.

215

యుచుండెను. ఆయనకుమారుఁడు వేదమంతయు గట్టిగా వల్లించినాఁడు ఇతరవిద్య లేవియు రావు అతనికిఁ జంద్రముఖియను భార్య క్రొత్తగాఁ గాపురమునకు వచ్చినది.

చంద్రముఖి మిక్కిలి చక్కనిది. నాసంకల్పానుగుణ్యములైన లక్షణములన్నియు నాపొన్నికొమ్మయం దున్నవి. చంద్రబింబమువంటి మొగము, తెలిసోగకన్నులు, బారెడేసి నల్లవెండ్రుకలు, ముత్యాలకోవ వంటి పలువరుస, అద్దమువంటి చెక్కులు, సన్ననినడుము, పలుచనిదేహము, బంగారమువంటి దేహచ్ఛాయయుఁ గలిగి లావణ్యపూర్ణములైన యంగకములతో నొప్పుచున్న యాయొప్పులకుప్పం జూచి నే నువ్విళ్లూరుచుంటిని.

భగవంతుఁ డెపుడు నసదృశసంఘటనమే చేయుచుండును. వేద జడునకుఁ జక్కనిభార్యం గూర్చి నాకు వట్టియెడ్డిదానిం గట్టిపెట్టెను. ఆచంద్రముఖియే నాభార్యయైనచో సంవత్సర మొకగడియవలె వెళ్లించుచుఁ సంతసింపకపోవుదునా ? అని దానింజూచినప్పుడెల్ల తలంచుచుందును.

చంద్రముఖి క్రొత్తగాఁ గాపురమునకువచ్చినది. అత్తమామల చాటున నాఁడుబిడ్డలసందున మెలఁగవలయును. ఇల్లు కదలుటకు నవకాశములేదు. అట్టియువతి నా కెట్లులభ్యమగునని తలంచినను నాయుత్సుకత్వము వదలినదికాదు. నాచదివిన గ్రంథములన్నియు విమర్శించి దానిగుఱించి యనేకతంత్రము లుపయోగించితిని.

కొన్నిదినములకుఁ జంద్రముఖిమామగారు కాలముచేసిరి. అత్తగారు మూలబడినది. ఆఁడుబిడ్డ లత్తవారింటి కరిగిరి. చివరకుఁ జంద్రముఖియే యింటికి యజమానురాలయ్యెను. కాల మెంతలో మాఱినదోచూడుము. స్వతంత్రము వచ్చిన తరువాత నేదోపనిమీద మాయింటికిఁ బలుమారు వచ్చుచుండును. కొన్నిదినములు నన్నుఁజూచి తొలఁ