పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

క్రమంబున సంతరించిపోవుచుండెను. దుర్వ్యసనములపాలై విద్యార్థులకు విద్యలు గఱపలేదు. సంతతము క్రీడాసక్తుండనై తిరుగుచుంటిని.

నాకు మాతండ్రియున్నప్పుడే శుద్ధశ్రోత్రియునిపుత్రిక నొక దానిం గట్టిపెట్టిరి. అది కాపురమునకువచ్చినది కాని దానికి శృంగారమునం దభినివేశ మేమియును లేదు.

క. మడికచ్చ పెద్దబొట్టును
    నడికొప్పును బెట్టికొనుచు నవ్వ విభూషల్
    దొడకగ పూర్వాచారపు
    నడవడి వర్తించుఁ బెద్దనాఁతియవోలెన్ .

నామదికి దానివేషభాషావిశేషము లేమియు సంతోషము గలుగఁజేయకున్నవి. నేనును కామసూత్రము, కందర్పచూడామణి, అనంగరంగము, రతిరహస్యము, నాగరవల్లభము, నాగరసర్వస్వము, కామరత్నము, మన్మథసంహిత, మనసిజసూత్రము, కాదంబరీస్వీకరణసూత్రము, కాదంబరీస్వీకరణ కారిక, నర్మ కేళీకౌతుకసంవాదము, రతిమంజరి, కామతంత్రము, రతికల్లోలిని, పంచసాయకవిజయము, స్మరదీపిక, లోనగు కామశాస్త్రములు నెన్ని యో చదివితిని. కొన్నిటికి వ్యాఖ్యానములు రచించితిని. నాభార్య కీవిలాసము లేమియు నవసరములేదు. నాచక్కఁదనమునకు నావిద్యకు సార్థకమేమి ? అని సర్వదా విచారించుచుందును.

నామిత్రులు కొందఱు వేశ్యాలంపటుఁడవుకమ్మని నాకు బోధించిరి. వేశ్యల వలపులు సహజములు కామింజేసి యందులకు నాబుద్ధి యొడంబడినదికాదు. సహజానురాగము గలిగి దివ్యరూపకళావతియగు లావణ్యవతితోఁ గూడనివానిజన్మ మొక జన్మమా ? అని సర్వదా తలంచుచుందును. నాలోపమునకు నేన వగచుచు సంకల్పశతములచే సుందర స్త్రీసంభోగ మనుభవించుచుఁ గొన్నిదినములు గడిపితిని.

మాప్రక్క నొక్క శ్రోత్రియబ్రాహ్మణుఁడు కాపురము సే