పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవభూతికథ.

213

చెప్పఁదొడంగెను.

−♦ దేవభూతికథ. ♦−

కుమారనగరంబున విష్ణుభూతియను బ్రాహ్మణుఁడు గలఁడు. అతఁడు వేద వేదాంగములు నెఱింగిన శ్రోత్రియుఁడు అగ్నిష్టోమాది క్రతువులుసేసిన యాహితాగ్ని; అభ్యాగతుల నర్చించిన యన్నదాత. అనూచానసంపత్తి గలిగి యథాన్యాయంబుగ గౌర్హ స్త్యధర్మంబులు నడుపుచుండఁ గొండొకకాలంబునకు నప్పుణ్యాత్మునకుఁ గులపాంసనుండనై కుమారుండనై నే నుదయించితిని. నాకు దేవభూతియని పేరుపెట్టను. నేను మిక్కిలి చక్కనివాఁడని చెప్పికొనుటకు సిగ్గగుచున్నది. నా కై దేఁడులు వచ్చినదిమొదలు మాతండ్రి నాకు విద్యగఱపించుటకుఁ బెద్దయత్నము గావించెను. పదుగురు గురువుల నియమించి యన్ని విద్యలు పాఠములు సెప్పించుచుండెను. నాబుద్ధి మిగుల సూక్ష్మమైనది. నాగ్రహణధారణశక్తికి నుపాధ్యాయు లచ్చెరుపడఁజొచ్చిరి. నాలుగు వేదములు నాఱుశాస్త్రములు, పాఠములుజెప్పుకొంటి నచిరకాలములోఁ దండ్రికంటె గొప్పపండితుండ నై తినని వాడుకపొందితిని. మా తండ్రి కొలదికాలములో స్వర్గసుఁడయ్యెను. పిమ్మటఁ జెప్పునదేమున్నది?

శ్లో॥ యౌవనం ధనసంపత్తిః ప్రభుత్వ మవివేకితా।
      ఏకైకమప్యనర్ధాయ కిముయత్రచతుష్టయం॥

యౌవనము, ధనము, ప్రభుత్వము, వివేకశూన్యత, ఈనాలుగు గుణములలో నేది గలిగినను ననర్థమునకుఁ గారణమగుచున్నది. నాలుగు నొకచోటనే యుండినచోఁ జెప్పఁదగినదేమి ? యౌవనమదము విద్యా మదము రూపమదము ధనమదము నన్నాశ్రయించినవి. నావంటివాఁడు పుడమిలో లేడని గర్వపడుచుంటిని. పండితులు వచ్చిన సత్కరింపక తృణప్రాయముగాఁ దలంచి యవమానించి పంపుచుంటిని. అభ్యాగతుల విద్యాగంధరహితులని పరిహసించి పూజంపనైతిని. మాతండ్రిగారివాడుక