పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

సమే. కానిచో నన్ను భక్షించి నీయాకలి యడంచుకొనుము. ఎట్లైనను జరితార్థుఁడనే యని వానికి జూలివొడమున ట్లుపన్యసించితిని.

నాయుపన్యాసము విని యాభూతం బోహొహో! యెంత మాట పలికితివి ? విద్యాభ్యాసముచేయ న న్నాశ్రయింపవచ్చిన నిన్నుఁ జంపుదునా ! ఎంతబ్రహ్మరాక్షసుండనైనను బుణ్యపాపవివక్షత తెలియదా? నీస్వల్ప దేహమున నాయాకలి యేమాత్ర మడంగఁగలదు ? అదియునుంగాక,

శ్లో. బాలోవాయదివావృద్ధోయునావాగృహమాగతః।
    తస్యపూజావిధాతవ్యా సర్వప్యాభ్యాగతో గురుః॥
    ఉత్తమస్యాపివర్ణస్య నీచోపిగృహమాగతః।
    పూజనీయో యథాయోగ్య స్సర్వదేవమయోతిథిః॥

బాలుండైనను వృద్ధుండైనను తనయింటి కతిథిగాఁవచ్చినచో దప్పక వానిఁ బూజింపవలయును. ఎల్లరకు సభ్యాగతుండు గురువువంటివాఁడు. మఱియు నీచకులుండైనఁ దనయింటి కతిథిగావచ్చిన వానిం గూడ యథాయోగ్యముగాఁ బూజింపవలయును. అతిథి సర్వదేవమయుండై యుండును అని శాస్త్రములు ఘోషింపుచుండ నిన్నుఁ జంపుటకు నాకు నో రెట్లువచ్చును ? శరణాగతుండవైన నీయభీష్టము దీర్పకున్న నాపాప మెట్లుపోఁగలదు ? నన్నుఁ దరింపఁజేయుట కే నీ విక్కడికి వచ్చితివి. నీతో సంభాషించుటచే నాపూర్వోదంతమంతయు నంతఃకరణ గోచర మగుచున్నది. నాయోపిన యుపకారము గావించి నే నీజన్మము నుండి విముక్తినొందెదనని పలికిన విని నే నాత్మగతంబునఁ దిరుగా జన్మించినట్లు తలంచుచు మహాత్మా ! నీపూర్వజన్మవృత్తాంత మెట్టిది? ఏమి కారణంబున నిట్టిరూపము వహించితివి ? వినుటకుఁ బాత్రుఁడనేని నీవృత్తాంత మెఱింగించి నన్నుఁ గృతార్థుఁ గావింపుమని మిక్కిలి వినయముతోఁ బ్రార్థించితిని. అతండు చెట్లుపైఁగూర్చుండియే తనవృత్తాంత మిట్లు