పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

లుండునని చెప్పుదురు. తద్భయంకరధ్వన్యంతరమున వేదఘోషము వినంబడుచున్నది. తప్పక యిది బ్రహ్మరాక్షసియే. ఇఁక నాయాయుర్దాయము గడియలలోనున్నది. అంత్యకాలమున వేదోచ్చారణ గావించుట ముక్తిప్రదంబని ధైర్యముదెచ్చుకొని నే నధికోత్సాహంబునఁ జెట్టుక్రిందఁ గూర్చుండి నడుముగట్టుకొని పదస్వరానుస్వారభేదములు లేకుండఁ దత్స్వరానుసారముగా,

సీ. సంహిత నున్నతస్వరమునఁ బఠియిుప
                స్వస్తి జెప్పితి సమస్వరముగదుర
    వరపరాయితము నేకరువువెట్ట నతండు
                కలిపి చెప్పితిని సక్రమముగాఁగఁ
    బదము వల్లింపఁ దప్పక నేను గవు లందు
                కొని సమంబుగఁ జెప్పితిని పదంబు
    క్రమము జెప్పిన నేను గ్రమము చెప్పితి జట
               నుచ్చరింపఁగ జట నుచ్చరించి

గీ. తిని ఘనఁ బఠింపఁ జదివితి ఘనను దులగ
    నుపనిషత్తులఁ జదువంగ నుపనిషత్తు
    లనె పఠించితి శ్రుతులెల్ల ననువదింప
    ననువదించితి సమముగా నతనితోడ.

అట్లు కవులు తప్పకుండ ముందరివార్యము లందిచ్చుచు సమముగా స్వస్తి చెప్పుచుంటిని. నాకంఠధ్వని విని యాభూతంబు క్రిందికి చూచి ఎవఁడవురా ? నీ విట్లు వెఱపులేక నాతో సమముగా వేద ముచ్చరింపుచుంటివి ? అని పెద్దకేకపెట్టి యడిగెను.

అప్పుడు వెఱపుడిపికొని మొండిసాహసముతో అయ్యా ! నా వృత్తాంతము వినవలయును. నేను గోనర్దీయుఁడను బ్రాహ్మణుఁడ. కాశిలో సమస్తవిద్యలుం జదివితిని. అందు నాకుఁ గ్రొత్తవిద్యఁ గఱపు