పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోనర్దీయునికథ.

209

అందులకే మీతో నుత్తరదేశారణ్యములకు రమ్మనిన రానైతిని. నీవును గొంత యరణ్యసంచారశ్రమ మనుభవించితివి కావున విస్తరించి చెప్పనవసరము లేదు.

ఒకనాఁడు చీఁకటిపడునప్పటి కొకరావిచెట్టుక్రిందఁ జేరితిని. అది సమతలమగుట నాతరుమూలము పవిత్రమని తలంచి యుడు శుభ్ర పఱచుకొని,

శ్లో॥ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే।
      అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతె నమః॥

అని నమస్కరించుచు నాతరుమూలమునఁ బండుకొని వృక్షములలో నశ్వత్థవృక్ష మైతినని చెప్పిన భగవద్గీతావాక్యమును స్మరించు కొనుచు నాతరురాజమునే భగవంతునిగాఁ దలంచుచుఁ దచ్ఛాఖల యందుఁ జూట్కులిడి ధ్యానించుచుంటిని. అప్పటి యథాస్థితిఁ దలంప మేను గంపమునొందుచున్నది, చూడుము. నాఁ డమావాస్య. కొంచెము మబ్బుకూడ పట్టినది, మహాంధకారము వృక్షచ్ఛాయలతో మిళితమై ఇది తెరువు ఇది యడవి ఇది మిన్ను అనుభేదము తెలియక కన్నులు మూసి కొనినను దెఱచినను నొకవిధముగానే కనంబడఁజొచ్చినది. ఝల్లరీ ధ్వానములచేఁ జెవులు బీటలువాఱుచుండెను. నిద్రబట్టక యొంటిప్రాణముతో నాచెట్టుక్రిందఁ బండుకొనియుంటిని. అర్ధరాత్ర మైనప్పుడు,

గీ. భైరవాట్టహాసభంగి భీకరముగ
    బొబ్బవెట్టికొనుచు భూత మొకటి
    భూరివాతఘాతమునఁబోలెఁ గొమ్మలు
    బొదల నాద్రుమాగ్రమునకు నుఱికె.

మేను ఝల్లుమన నాభూతంబు నాపైఁబడి ప్రాణంబు పీల్చు చున్నట్లుగాఁ దలంచి మేను వివశమునొంద నందుఁబడియుండి యంతలోఁ దెలిసికొని యోహో ! తెలిసినది. రావిచెట్టుపై బ్రహ్మరాక్షసు