పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

158 వ మజిలీ

గోనర్దీయుని కథ.

మ. నగముల్ ధూళిగ ధూలి శైలముగ సంద్రంబు న్విలాసస్థలం
     బుగఁ దెప్పన్ సుగభీరవార్ధిగఁ దృణంబు న్సారవజ్రాయుధం
     బుగ వజ్రంబు దృణంబుగాఁగను హిమంబు న్వహ్నిగా వహ్ని మం
     చుగఁ గావించెఁడు నద్భుతాచరణదక్షుం డీశ్వరుం డెప్పుడున్ .

మిత్రమా ! అఘటితఘటనాసమర్ధుండగు భగవంతుని విలాసములు కడు చిత్రములు. వినుము. మనమందఱ మొకసారియే. కాశీపురంబు విడిచితిమి. నేను బశ్చిమదిక్కుగాఁ బోయిపోయి యనేకపురనదీపక్క ణారణ్యములు సూచుచు నందందుఁగల వింతలఁ బరికించుచు రెండు నెలలు గడపితిని. ఆలోపలఁ జెప్పఁదగిన విశేష మేదియు నాకుఁ గనంబడ లేదు.

ఇఁక ధారానగరంబుమార్గంబుపట్టి పోఁదగునని నిశ్చయించుకొని యొకగ్రామములో నామార్గ మడిగి తెలిసికొని దక్షిణాభిముఖుండనై పోవుచుంటిని. పుడమితెరపికన్న నడవిగలదేశమే యెక్కువగా నున్నదని తలంచెదను. నేనుబోవుదారి నరమృగపక్షిశూన్యంబగు నొకమహారణ్యములో దింపినది. ఎన్నిదినములు నడిచినను నాయడవికిఁ దుదిమొదలు గనంబడలేదు. ఎన్నిదినములు నడిచితినో యేదిక్కునకుఁ బోవుచుంటినో తెలియక దిగ్భ్రమజెంది తిరిగినచోటే మరలఁ దిరుగు చుంటిని.

కందమూలఫలాదులచే నాకలి యడంచుకొనుచుంటిని గాని క్రమంబున మేనిలో బలము తరుగుచుండెను. ఇఁక నాయరణ్యము దాటి పోవఁజాలనని యధైర్యము గలిగినది. మిత్రదర్శనము లభింపదని విచారించుచుంటిని. అక్కాంతారములో మరణము నాకు విధి విధించెనని నిశ్చయించుకొంటిని. నాకు మొదటినుండియు నడవులనిన భయము.