పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పల్లెవాండ్రకథ.

207

యేడ్చుచు నమ్మయ్యో ! యెంతయాపదదాటినది? క్షణముదప్పిన ని న్నీ జన్మమునకుఁ జూచుట తటస్థింపకపోవును గదా ? ఆహా మహాను భావులు పల్లెవాండ్రు. వారినెల్ల నిటు రప్పింపుము. వారిగేహములెల్ల బంగారుమయము గావించెదను. నిన్న గాధహ్రదమునుండి పైకిలాగిన జాలము నొకసారి నాకన్నులం బెట్టింపుము. దానిపై బంగారుతీగెలతో నల్లించి కులదేవతవలెఁ బూజించుచుందును. అని మఱియు నలుకదోప నిన్నుఁ జంపబూనిన యాదుఃష్టుం డాకృతఘ్నుఁడు ఆపాపాత్ముఁ డిందే యున్నవాఁడా? వాని నిప్పుడేపోయి శిరచ్ఛేదము గావించెద నాన తీయుము అని దుఃఖోన్మాదంబునం బలుకుచున్న గోనర్దీయునూఱడించుచుఁ గుచుమారుండు తనయుత్తరీయమున నతని కన్నీరు దుడుచుచు వయస్యా ! నేను బ్రతికితినికాదా? విచారించెదవేమిటికి ? ఊఱడిల్లుము శంబరుని కాలమే శిక్షింపఁగలదు. వానితండ్రి గావించిన సహాయమునకై విశ్వాసము హృదయంబున బాధించుచున్నది. అందులకై వాని నేమి చేయుటకు మనసు రాకున్నది. అది యట్లుండె. నీ వీరాజ్య మెట్లు సంపాదించితివి ? నీవృతాంతము జెప్పుమని యడిగిన నతండు కన్నులం దుడిచి కొనుచు నిట్లనియె.

మిత్రమా ! నీపాటు వినిన దుఃఖ మాగినదికాదు. దుర్జనులఁ జేరనిచ్చిన విపత్తు గలుగకమానదు. నిన్నట్లు పరాభవించి తానే కుచుమారుండనని ప్రకటించుచున్నవాఁడు గాఁబోలు. అయ్యో ! తొందరపడి తెలియక సరస్వతి వానిం బెండ్లియాడదుగదా? నీవు చెప్పినమాటలు విన నారమణి యసామాన్యప్రజ్ఞ కలదిగాఁ దోఁచుచున్నది. మఱలఁ బరీక్షింపక యంగీకరింపదు. కానిమ్ము దైవసంకల్పము మార్ప మనతరమా ? ఇఁక నావృత్తాంతము జెప్పెద నాలింపుమని యిట్లు చెప్పు చుండెను.

అని యెఱింగించునంతఁ గాలాతీతమైనది. తరువాత వృత్తాంతము పైమజిలీయం దెఱింగించెద.