పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పల్లెవాండ్రకథ.

205

డితులతో నార్యులారా ! ఆగోనర్దీయుఁడు క్షత్రియుఁడా ? అని యడిగిన వారు నవ్వుచు క్షత్రియుఁడుకాఁడు. బ్రాహ్మణుఁడే. మహావిద్వాంసుఁడు. మంత్రశాస్త్రములో నాయనకుఁ జాలినవాఁడులేఁడు. జయపురాధీశ్వరునిపుత్రికను బట్టినభూతమును వదల్చి యామెం బెండ్లియాడి యా దేశమునకు రాజయ్యెను. అని సంక్షేపముగా నాతనివృత్తాంతము జెప్పిరి. అతని కంతకంటె నప్పుడు తెలిసికొనుట కవకాశము గలిగినదికాదు.

ఆవిద్యాంసుల నూరకయే రేవు దాటించి యేనుఁగులు గుఱ్ఱములు లోనగు జంతువులు దాటుటకుఁ దగిన యోడలఁ బెక్కు నియమించి నావికులనెల్ల నాయత్తముగానుండుమని యానృపతిరాక కెదురుచూచు చుండె. అమ్మఱునాఁడు యథాకాలముకే గోనర్దీయుఁడు సపరివారముగా వచ్చి యందు విడిసెను. రాజభటులు కొందఱు తొందరగా నేటి యొద్దకు వచ్చి గుత్తదా రెవ్వఁడు? నావల సిద్ధపఱచెనా? యని యడిగిరి.

బ్రాహ్మణుఁడు లేచి అన్నియు సిద్ధముగా నున్నవి. అవి యేనుఁగులు దాటునవి, అవి గుఱ్ఱములకు, నవి మనుష్యులకు, నది రాజుగారి కని వేఱువేఱ నిరూపించిచూపించెను. రాజభటులు సంతసించుచు అయ్యా ! మీరొకసారి మారాజుగారియొద్దకు రండు. కర్తవ్య మెఱింగింతురని పలికిన వల్లెయని యావిప్రుండు వారివెంట గోనర్దీయుచెంత కరుగుచుండెను. అప్పుడే యేనుఁగును దిగి నదీతీరమునకు విహారార్ధమై గోనర్దీయుఁడు వచ్చుచుండెను. ఇరువురు దారిలోఁదారసిల్లిరి.

రాజభటులు వంగి సలాముసేయుచు మహారాజా ! యీతడే నావికాధిపతి. మంచినావల పెక్కు సిధ్ధపఱచియుంచెను. దేవరదర్శనార్థమై తీసికొనివచ్చితిమని పలికిరి. అప్పు డతం డాపాఱు నెగాదిగా చూచి విస్మయముతో నీపేరేమి ? మీ కాపుర మెందు ? జన్మభూమి యేది ? అని యడిగిన నావిప్రుండు నవ్వుచు నాపేరు కుచుమారుఁ డందురు. అని చెప్పుచుండఁగనే యారాజు ఓహోహో ! మిత్రుఁడా !