పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వలసియున్నది. ఒకనాఁడు నలువురు నాఋణవిభేద మేర్పఱుచుకొనుటలో నొకఁడు స్వకుటుంబము నిమిత్తము తెచ్చిన పంచదార నారోగికైన వ్యయపట్టికలో వ్రాయుటచే వారిలో వారికిఁ దగవు వచ్చినది. వా రా విషయమై కలహించుచు నిజము తెలిసికొనుటకై పురోహితునింటికి వచ్చి యామర్మ మాయనతోఁ జెప్పికొనిరి.

ఆకలహప్రకారమంతయును విని యారోగి వారినెల్లరఁ బిలిచి బాబులారా ! మీరు నాకొఱకుఁ జాలశ్రమపడుటయేకాక సొమ్ముకూడ సెలవుచేసిరి. అందులకుఁ గృతజ్ఞుఁడనగుటయేకాక మీకైన ఋణమున కిబ్బడి యిచ్చివేయుదును. ప్రస్తుత మంతకన్నఁ జెప్పజాలను. బ్రతికియుండిన మిమ్ముల సమానులలో నత్యధికులఁ జేయుదునని చెప్పుట ముఖ ప్రీతిమాట యగును. లేచి తిరుగుటకుఁ గొంచెముశక్తి వచ్చుచున్నది. కొలఁదిదినములలో మీఋణము తీర్తును. మీరు నానిమిత్తమై తగవు లాడవలదని గడ్డములు పట్టుకొని బ్రతిమాలుకొనియెను. వా రంగీకరించి వెనుకటిరీతిగా మైత్రితో మెలఁగుచుండిరి.

ఒకనాఁడు కొందఱువర్తకు లాపల్లెకు వచ్చి తమకు నోడనడుపుటకై చదివికొన్నపల్లెవాఁడు కావలయును. వానికిఁ దగినవేతన మిత్తుము. మే మొకయేటిరేవు గుత్తకొంటిమి. అందు దాటు మార్గస్థులకడఁ బుచ్చికొనిన సొమ్ము నమ్మకముగాఁ బద్దులువ్రాసి యప్పగించవలయును. అందలి యధికారమంతయు వాని కిచ్చివేయుదుము. నదియొడ్డుననే కాపురముండవలయునని యానిబంధనము లన్నియుఁ దెలియఁ జేసిరి,

అట్టిపనికిఁ దగినవాఁడొక్కఁడు నందు లేడు. పురోహితునింట నున్న బ్రాహ్మణుఁడావార్త విని నే నప్పనులన్నియు నమ్మకముగాఁ జేయుదును. నాకు మొత్తముగాఁ గొంతవిత్త మీయవలయును. నెలనెలకు వేతనములోఁ గొంత దీసికొనుచుండవలయునని తన సామర్థ్యమంతయు నక్కజమందునట్లు వారికిఁ దెలియఁ జేసెను.