పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శంబరునికథ.

197

అదియే మందమతియని సరస్వతి తలంచినది.

సారసిక యరిగిన వెనుక శంబరుడు అయ్యో! నేను దెలివితక్కువ పని గావించితిని తిరుగాఁ బరీక్షింపరనియు సరస్వతినిఁ బెండ్లియాడ వచ్చుననియుఁ దలంచితిని. నాప్రయత్న మంతయు వ్యర్థమైనది. వీరికిఁ దెలియకుండఁ బారిపోవుటయే లెస్స. ఇందుండిన నాగుట్టు బయలుకాక మానదు. అని యాలోచించుచుండ మంగళవాద్యములు వినంబడినవి. ఆధ్వని విని శంబరుండు వాకిటకు వచ్చెను.

మంత్రిసామంతపురోహితాదులు ముందు నడువ మనోహరాలంకారభూషితమగు భద్రగజం బొండు వచ్చుచుండెను అది యెవ్వరి నిమిత్తమో యని యాలోచించుచుండ నందు నిలువంబెట్టి కుచుమారుం డిందేయున్నవాఁడు. వారిబస యిదియే యని కొందఱు పలికిరి. కుచుమారుం డెందుండెనని యడిగిన నేనే కుచుమారుండనని శంబరుఁడు తెలియఁజేసెను.

అప్పుడు మంత్రు లతని సకలాలంకారభూషితుం జేసి యా యేనుఁగుపై నెక్కించి య రేగింపుచుం దీసికొనిపోయి యొక దివ్య సౌధంబునం బ్రవేశపెట్టిరి. ఆసంతోషములో నతండు పారిపోవు మాటయే మఱచిపోయెను. పరిజను లతనికి రాజోపచారములు సేయుచుండిరి కాని వానికి సంతోషముమాత్రము లేదు. ఎవ రేమన్నను బెదరుతో మాట్లాడుచుండును. అని యెఱింగించునంత వేళ యతిక్రమించినది.

157 వ మజిలీ.

−♦ పల్లెవాండ్ర కథ. ♦−

పురందరపురమునకుఁ గ్రోశముదూరములో నొకపల్లె గలదు. అం దున్నవాండ్రందఱు పల్లెవాండ్రే. వాండ్రు వలలు వైచి చేఁపలఁ బట్టియు నోడలఁ ద్రోసియుఁ దమకు జీవనమే జీవనాధారముగాఁ గాలక్షేపము చేయుచుండిరి. ఆపల్లెలోనివారికెల్ల నొకపురోహితుఁడు