పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

సఖీ ! ఆతండు నీవువ్రాసినలిపి యెఱిఁగినవాఁడుగాఁ దోఁపలేదు. పై పెచ్చు మాటడిగినందులకుఁ బెద్దకోపముఁజెందెను. నీవు పెద్దలతో నాలోచింపకుండఁ దొందరపడి నీవే భర్తవని హారము నంపుదువా ? ఆతండు వట్టిమూర్ఖుఁడువలె గనఁబడుచుండెను. మాటాడుటయే తెలియదు. శాస్త్రపరిశ్రమ చేసినట్లే తోఁచదు. అని యక్కడజరిగిన సంవాదమంతయు నెఱిగించినది.

సరస్వతి సీ! అసహ్యపుమాటలాడకుము. మొగమునఁ గళలేదనియు వక్తృత్వమే యెఱుఁగఁడనియు మూర్ఖుఁ డనియుఁ బలుకుట నీయపరిజ్ఞతలోపముగాక మఱియొకటికాదు. సర్వదేశభాషాలిపిజ్ఞానునకు నాలిపి తెలియదనుట సమంజసము గాదు. పలుమా రడిగితినని కోపము వచ్చి యట్లనిరి. పోనిమ్ము మఱేమియు నడుగవలదు. ఈశ్లోకముచూచి ప్రత్యుత్తరము వ్రాసి యిమ్మనుము. స్వదేశలిపితోనే వ్రాయుచుంటినని పలికి యొకశ్లోకము వ్రాసియిచ్చి యంపినది.

శ్లో॥ భో ! రూపనిజిన్‌త మహేంద్రకుమార మార
     శ్రీరాట్కుమార కుచుమార ! దురుక్తిజాలైః
     యత్త్వామనాయికధితో త్తరరూపభేదం
     తత్ క్షంతు మహన్‌సి, జితాస్మి భవత్కలాభిః॥

ఆశ్లోకము తీసికొనిపోయి సారసిక శంబరున కిచ్చినది. ఆతం డా శ్లోకము జదివియుఁ దదర్థావబోధనము చేసికొనలేక తల కంపించుచుఁ బ్రత్యుత్తర మిమ్మని కోరుచున్నసారసికతో నేను దీని కిప్పుడు ప్రత్యుత్తర మీయను. వెనుకనుండి పంపించెద నీవు పొమ్ము, అని కచ్చితముగాఁ బలికి లోపలికిఁ బోయెను.

సారసికయుఁ జిన్నబుచ్చుకొని సరస్వతియొద్దకుఁ బోయి సఖీ ! నీవు నన్నుఁ దిట్టినను దిట్టెదవుగాక; వానిం భర్తగాఁగోరుట యవివేకము . వాఁడు వట్టిమందుఁడు. బాగుగా నాలోచించుకొనుమని పలికినది,