పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శంబరునికథ.

195

విద్యావిషయముగానఁ బ్రసంగించితిని. గెలుపుగొంటి నంతియచాలు. నన్నుఁ బెండ్లియాడుట కామె కిష్టములేకున్న మానివేయమనుము. జయింపఁబడితి నని పత్రిక వ్రాసియిమ్మనుము. పొమ్ము అని పలుకుచు నాహారము దానిముందరఁ బారవైచెను.

సారసిక రసికాగ్రేసరా ! కోపపడియెద రేమిటికి ? పత్రికలోఁ జిత్రములైనవిషయములు వ్రాసినదిగదా ? చిలుకకు విద్యలు చెప్పక పోవుదురుగాక. ఆమెకుఁ బ్రత్యుత్తర మేమిటి కియ్యరు ? అది మిమ్ములఁ బరీక్షించుటకాదు. అభిలాష దెలుపుట. నా కాలిపి తెలియదు. ఏమని వ్రాసినదో చదువుఁడు. అని యడిగిన వాఁడు ఓహో ! నే నామాత్రము దెలియనివాఁడను గాను. నాకు దేశభాషలిపిజ్ఞాన మున్నచో లేదో యని విదేశలిపితో వ్రాసినది. ఇంతకన్నఁ బరీక్ష యేమున్నది? అని పలికెను.

పోనిండు. మీ కఱువదినాలుగువిద్యలు వచ్చుంగదా? మీరు మఱియొకలిపితో మఱియొకభాషతోఁ బ్రత్యుత్తరము వ్రాసి యామెనే పరీక్షింపుఁడు. అందులకుఁ గోప మేమిటికి? అదియునుంగాక మీరహస్యము లితరులకుఁ దెలియకుండ నీలిపితో వ్రాసిన దనుకొనరాదా? అని సమాధానముజెప్పిన నమ్మూఢుఁ డిట్లనియె.

సారసికా ! ఆమాట లేమియు నాకడఁ జెప్పకుము. పరీక్షకే యడిగినది. అందులకే నాకుఁ గోపమువచ్చినది. వేయిజెప్పుము. నేను బ్రత్యుత్తర మీయను. హారము దీసికొనిపొమ్ము. అని మొండివాదము సేయఁబూనెను. సారసిక యాలిపి వానికిఁ దెలియలేదని గ్రహించినది. వానిమాట లసందర్భములుగా నుండుట కుచుమారుం డతఁ డగునో కాడోయని సందియము హృదయమునఁ బొడమినది.

సంశయడోలాయితహృదయసారసయై సారసిక యిపుడే వత్తు ననిచెప్పి యప్పుడే సరస్వతియొద్దకుఁ బోయి మోమున విన్నఁదనము దోఁప నిట్లనియె.