పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వచ్చితిని. అనుటయు సరస్వతి ఏమీ ! వానిరూప మసహ్యముగానున్నదియా ? ఆనియడిగిన సారసిక వాని మొగంబున నా కేమియుఁ దేజము గనంబడలేదు. దరిద్రదేవత నాట్యమాడుచున్నది. అని చెప్పిన సరస్వతి యిట్లనియె. “విద్వత్సు దారిద్ర్యతా" అనియుండలేదా ? ఎట్లైనను జదివికొనినవానిమొగము తేజోవంతముగా నుండవలయు నది నీవు గనిపెట్టలేకపోయితివి. పోనిమ్ము. “విద్యారూపం కురూపాణాం” రూపహీనులకు విద్యయేరూపము. వెండియు నీ వీచిలుక నాయనయొద్దకుఁ దీసికొని పోయి దానికివలెనే దీనికిఁ గూడ విద్యోపదేశము గావింపుమని కోరుము. అని యొకచిలుకను బత్రికతోఁగూడ సారసికచేతి కిచ్చి యంపినది.

సారసిక యాతనియొద్ద కరిగి నమస్కరించిన ముసిముసినగవులు వెలయింపుచు శంబరుఁడు యోషామణీ ! విశేషము లేమి ? ఈచిలుక యెక్కడిది ? అనియడిగిన నది రాజపుత్రిక యిచ్చినపత్రిక యతని కిచ్చి ఆర్యా ! ఈచిలుకను సకలకళాభూషితం జేయుమని యామె కోరుచున్నది. వెనుకటి చిలుకనుగుఱించి చాల విచారించినది. దీనిం బ్రజ్ఞాన్వితం గావించినచో నావిచార మామెను బాయఁగలదు. అంతయు నీపత్రికలో నున్నది. చదివికొనుఁడు. అని పలికిన విని యతండు మతిదిగులుదోప నా పత్రిక నిటునటు త్రిప్పి విదేశలిపితోనుండుటచేఁ జదువలేకపోయెను.

47 కళ దేశభాషలిపిజ్ఞానము.

అది వాని కేమి తెలియును? చదివినట్లు చివరంటఁజూచి పత్రిక మడిచి మొగంబునఁ గోప మభినయించుచుఁ జాలుఁజాలు సారసికా! ఇదియా ? రసికత. అస్తమానము మా కిదియేపనియా? మావిద్యల వృథగా వినియోగించుట నా కిష్టములేదు. ఒకమాటు పరీక్షించినది తగు సమాధాన మిచ్చితిమి పలుమా రడుగుటకు నామెకుఁ దీరికయున్న దేమో? మాకుఁ దీరికలేదు. ఈ చిలుకకు నేను విద్య లీయనని చెప్పుము. ఇదిగో యామె ముత్యాలహారము తీసికొనిపొమ్ము. ప్రకటనఁజూచి