పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మన సెంత, ఆహా ! గుడిమ్రింగినవానికి గుడిలోని లింగ మేమూలకు లెక్క, అనినట్లు కుచుమారుఁజంపిన క్రూరునకుఁ జిలుకనుజంపు టొక యబ్బురమా ?

నాఁడు రామచిలుక తిరుగాఁ దనయొద్దకు రామింజేసి పరితపించుచు సరస్వతి సారసికయను సఖురాలిం జేరి యోసీ ! యాశుకము నాసందేశము దీసికొనిపోయి మఱల వచ్చినదికాదు. కారణము తెలియదు. ఆపండితకంఠీరవుఁడు తనయొద్దనే యుంచుకొనెనా ? ఏది యెట్లైన నీవొకసారి వారియొద్దకుఁ బోయి చిలుకమాట తెలిసికొని తదాకారంబు చిత్రఫలకమున వ్రాసికొనిరమ్ము ఇదివఱకు వారి రూప మెట్లున్నదియో విచారింపలేదు. చిలుక నడుగవలయుననుకొని మఱచి పోయితిని. నీవు వోయివచ్చిన నన్నియుం దెలియఁగలవని నియోగించుటయు నది యతఁడున్న నెలవునకు గురుతులడిగి తెలిసికొని తిన్నగాఁ బోయి వాకిట నిలువంబడి కుచుమారుండున్న నెల విదియేనా ? అని యెవ్వరినో యడుగుచుండ విని శంబరుఁడు తలుపుతీసికొనివచ్చి అవును. ఇదియే యాతఁడున్న నెలవు. నేనే కుచుమారుండ నీవెవ్వతెవని యడిగెను.

సారసిక నమస్కరించినది. లోపలికిఁ దీసికొనిపోయి కూర్చుండుమని నియమించి దానిం బెద్దగా గౌరవించి నీవు వచ్చినపని యేమని మఱల నడిగెను. అయ్యా ! నేను సరస్వతి సఖురాలను సారసికయను దాన. మీ రామెతో నిదివఱ కుత్తరప్రత్యుత్తరములను జరపుచున్న కుచుమారులు మారేనా వారు లోపలనున్నారా? అని యడిగిన నతండు నవ్వుచు జవ్వనీ' ! నీతో నేను బరిహాసమాడుదునా? మీరాజపుత్రికను విద్యలలో జయించి పెండ్లియాడఁ దలఁచికొన్నవాఁడ నేనే యని మఱల నుత్తరము చెప్పెను.

సారసిక స్వామీ ! మారాజపుత్రిక మీయొద్దకు నిన్న రామ చిలుక నంపినది. అది తిరుగవచ్చినది కాదేమి ? మీయొద్దనే యుంచు