పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తునికథ

7

యక్షుఁడు — చాలుచాలు అమ్మహారణ్యమధ్యమునకు మనుష్యులు రాఁగలరా ? ఆకవి దైవశక్తిగల వాఁడఁట వినుము ఇంతకన్న రహస్యమైన విషయము వర్ణించెను.

యక్షిణి - ఏదీ ? చదివి వినిపింపుఁడు.

యక్షుఁడు -

శ్లో॥ భూయ శ్చాహ త్వమపి శయనెకంఠలగ్నా పురా మె
      నిద్రాం గత్వా కిమపి రుదతీ సుస్వరం విప్రబుద్ధా
      సాంతహాన్ సం కథిత మస కృత్పృచ్ఛత శ్చ త్వయా మె
      దృష్ట స్వప్నె కితవ ! రమయ న్కా మపి త్వం మ యేతి !

నీవల్ల నాఁడురాత్రి నిద్రబోవుచు లేచి వెక్కి వెక్కి యేడ్చుచుండ నేను గారణమేమని పలుమారడుగ నీవునవ్వుచు వంచకుఁడా! మఱియొకకాంతతో నీవు రమించుచున్నట్లు స్వప్నములోఁ గనంబడితివి అందులకని చెప్పితివి. ఈరహస్యము మనయిరువురకుఁగాక యొరులకుఁ దెలియదు. నేనది యానవాలుగా నీతోఁ జెప్పుమనిమేఘునితో పలికితిని ఆమాటయే యీకవి వర్ణించెను.

యక్షిణి — మీరేమన్నను సరియేకాని మీరామేఘునితోఁ జెప్పుచుండ నాకవి వినెను. లేనిచో యెట్లు వ్రాయఁగలఁడు.

యక్షుఁడు – అయ్యో ! నీకుఁ జెప్పినం దెలియకున్న దేమి ? ఆపర్వతమందు మనుష్యు లెవ్వరును లేరు. నేనొక్కండనేయుంటిని అతండు మహర్షితుల్యుఁడు త్రికాలవేదియనిచెప్పిరి ?

యక్షిణి - మహానుభావుండైన యాకవీంద్రుని పే రేమియో తెలిసికొంటిరా?

యక్షుఁడు - ఈగ్రంథమందే వ్రాయబడియున్నది. మహాకవి కాళిదాసకృతౌ మేఘసందేశే ! అని

యక్షిణి - ఆతడెందుండును ?