పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరస్వతి కథ.

189

టదని యెఱుఁగుము. అదియునుంగాక దీనికి భాగస్వాములు నామిత్రు లార్వురు గలరు. వారితో నాలోచించి నీకును దగినయుఛ్రయము గలుగునట్లు చేయించెద సందియపడకుము. అని పలికెను.

ఆమాట విని శంబరుఁ డాత్మగతుబున నౌరా ! వీఁ డెంతగర్వముగా మాటాడెను? వీని కీయుపాయము మాతండ్రి చెప్పకున్న నీ యైశ్వర్యము లభించునా ? ఆవిశ్వాస మించుకయు లేక యీరాజ్య మెక్కడనోయున్న మిత్రులకుఁ బంచిపెట్టునంట. వారినడిగి నా కేదియో యిచ్చునంట. ఇట్టి తుంటరిం జంపినం దప్పులేదు. వీనిప్రాణములు నాచేతిలో నున్నవి. వీనిం గడతేర్చి నేనే కుచుమారుండనని ప్రకటించెద. సరస్వతియు రాజ్యము నాకే దక్కఁగలదు. ఇఁక సరస్వతి విద్యాప్రశంస చేయదు. పెండ్లియాడినతరువాతఁ దెలిసికొనిన నేమిచేయఁగలదు ? ఉత్తరప్రత్యుత్తరములు పత్రికామూలమున జరగుట యాచారము. గుఱుతెఱింగినవారు లేరు వ్రాసినవ్రాఁతయంతయు నాదేగదా ! మహారాజ్యవైభవ మబ్బుచుండ బ్రహ్మహత్యకు వెఱవఁ బనిలేదు. అవసరమునుబట్టి యింద్రుండంతటివాఁడు గావించెను. అని నిశ్చయించి నాఁటిసాయంకాలముదనుక యుపాయ మాలోచించుచుఁ దగినసన్నాహము గావింపుచుండెను.

నాఁటిరాత్రి భుజించినతరువాత మంచముపైఁ బండికొని తాంబూలము నమలుచుఁ గుచుమారుండు శంబరుం జీరి వత్సా! నేఁడు నీ మొగముజూడ వేఱొకరీతిగా నున్నది. ఆనందించుసమయంబున విన్న బాటేమిటికి ? ఈపెండ్లికిఁ బెత్తనమంతయు నీదేకదా. నీతలిదండ్రులు నీబంధువులు పెండ్లివారు. నీయానందమే నాయానందము. నామిత్రులు దూరమందున్నారు. ఇందులకు ముఖ్యుఁడవు నీవేయని పలికిన విని శంబరుఁ డాత్మగతంబున అబ్బో ! అప్పుడే యీరండాపుత్రుఁడు రాజ్యము సరస్వతియుఁ దనకుఁ దక్కినవని యుబ్బుచున్నాఁడు. ఎక్కడ