పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరస్వతి కథ.

185

నుండై మఱియు నిట్లు వ్రాసెను.

మ. నను వాదంబున నోడఁబుచ్చినపు డానందంబుతోఁ బిల్చి హే
     ళనగా బీరము లింతమాత్రమున కేలా ? విప్ర ! మేల్ తెల్లమ
     య్యెను పాండిత్యము బ్రాహ్మణుండవగుటన్ హీనంబుగాఁ బంపరా
     దని కాన్కుల్ దయచేసినన్ గొనెద గాదా? మీఁద నేఁ డేటికిన్ ,

మ. ప్రకటింపంబనిలేదు మీ కటులు దర్పంబొప్ప నాయిచ్చు స
     ర్వకలాప్రశ్నల కుత్తరం బిడినవిద్వాంసుడె మత్ప్రాణనా
     యకుఁ డంచున్ మృషలయ్యె నాపలుకు లాహా ! యిప్డు మీరిచ్చుకా
     నుకలం గైకొన నే జితోస్మి యనినన్ బోదుం జలేజాననా !

అని వ్రాసి యాపత్రికతోఁగూడఁ గానుకలఁ బ్రధానులకడ కంపివేసెను. వా రావార్త సరస్వతికిఁ దెలియఁజేసిరి. సరస్వతి మిక్కిలి యీసుబూని ఏమీ! కులగౌరవము మన్నించినందులకు నతం డిట్లవమానపఱచునా? కానిమ్ము. ఆపాఱుఁడు వ్రాసినట్లు పిమ్మటనే యెత్తి పొడిచెదంగాక యని యాలోచించి కొన్నిపుష్పంబులఁ గుచుమారు నొద్ద కనిపినది.

మాల్యగ్రధనవికల్పా! అను 14 విద్యలోఁ బ్రశ్నమడిగినదని నిశ్చయించి కుచుమారుం డాపూవులనెల్ల విచిత్రములైన మాలికలగాను బంతులగాను మండనములుగాను నన్నిటియుదుఁ దనపేరు వింత రంగులపూవులతోఁ గనంబడునట్లు కట్టి వానిని బ్రధానిముఖముగా రాజపుత్రికయొద్ద కనిపెను.

ఆపుష్పదామంబులం బరిశీలించి యమ్మించుఁబోఁడి వెఱఁగుపాటుతో నోహో! ఈమహీసురుండు నాయభిప్రాయము గ్రహించెను. చతుష్షష్టికళాపాండిత్య మున్నట్లు తోఁచుచున్నది. పెరవా రీవింతమాలికలఁ గట్టఁజాలరు. అని సంతసించుచుఁ గొన్నిరత్నములను గృత్రిమరత్నములను బంపి వెలగట్టుఁడని నియమించినది.