పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

కాశీమజిలీకథలు—ఎనిమిదవభాగము.

చనపురస్సరముగా సంభాషించెను. తదీయరాజ్యప్రాప్తివలనఁ దనకుఁగూడఁ గొంతలాభము గలదను సంతసముతో నాయజమానుం డాకుచుమారుని మార్గగమనశ్రమమువాయ నాలుగుదినములు దనయింట నుండుమని ప్రార్థించెను. శంబరుఁడను తనకుమారు నాతని కుపచారములుసేయ శిష్యునిగా నియమించెను.

కుచుమారుండు నాలుగుదినము లాయగ్రహారమున వసించి యాయాసముఁదీఱుచుకొని శుభముహూర్తమున బయలుదేరి శంబరుఁడు శిష్యుండై తోడరాఁ గొన్నిపయనంబులకుఁ బురందరపురము ప్రవేశించెను. సరస్వతీపరిణయలాలసులగు విద్వత్ప్రభుకుమారులచే నా నగరము నిండియున్నది. ఎక్కడవినినను నామె విద్యాతిశయము గుఱించి జరగు సంవాదములే. ఏవీధికిఁబోయినను రాజపుత్రు లామెకు సమాధానము చెప్పలేకపోయిరను వార్తలే. అట్టివిశేషము లాలించుచు నాపట్టణపువీధులఁ దిరిగి తిరిగి కుచుమారుండు ప్రకటనలఁ జదివి చదివి తిన్నగాఁ బ్రధానపురుషులయొద్దకుఁ బోయి, అయ్యా ! వినుండు.

చ. ప్రచురము చేసినట్టి నృపుపట్టి సరస్వతివార్త నాలకిం
    పుచు నిట కేగుదెంచితిని భూసురుఁడం గుచుమారుఁడం గళా
    నిచయములెల్ల నార్మసన నృత్యము సేయుచుచున్న వాకుభృ
    త్కుచ యొనరించుప్రశ్నములకుం దగునుత్తర మిత్తు నిత్తఱిన్ .

క. వాదింతు నే సరస్వతి
   తోఁ దులగా నాదుసర్వతోముఖవిద్యా
   వైదుష్యము గనుపింప ని
   వేదింపుఁడు నాదురాక వెలఁదుక కనినన్.

అమాత్యులు నవ్వుచు,

గీ. వలదు, పోవయ్య ! మాసరస్వతిని గెలువఁ
    దరమె నీ కిది యడియాస తగదు తగదు