పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరస్వతి కథ.

181

మిక్కిలి వదాన్యుఁడు. భోజరాజువలెఁ గవీంద్రులఁ బండితుల నాదరించును. ఆనృపతికిఁ బురుషసంతతి లేదు. సరస్వతి యను నొకకూఁతురు గలదు. ఆమెచరిత్రమే వినవలసినది. ఆయువతి నిరతిశయ సౌందర్యంబును బ్రకాశించుచున్నదని చెప్పుట యొకగొప్పమాట గాదు. సారస్వత వైభవ మంతయు నామానవతి యధీనమై యున్నది. చతుష్షష్టికళలు బాలరామాయణమువలె నావటమై యున్నవి. ఆఱుశాస్త్రములు తల క్రిందుగా నేకరువుపెట్టఁగలదు. పెక్కేల? ఆయువతి విద్యలలో సరస్వతి యని చెప్పఁదగినది. చివరమాట వినుఁడు. ఆబోఁటి విద్యలలోఁ దనపరీక్ష కాగినవానింగాని యొరుని బరిణయమాడనని శపథము చేసి యున్నది. అనేక రాజకుమారులు శస్త్రాస్త్రనిపుణులు విద్యాధనరూప ప్రాభవోపేతులు వచ్చి యచ్చిగురాకుఁబోఁడి గ్రహింపఁ బ్రయత్నించిరి.

విద్యలలోఁ బరీక్షించి యయ్యంబుజాక్షీ, యెవ్వరిం బరిగ్రహించినదికాదు. ఎవ్వనికిం గనంబడదు. మీరు సమర్థులేని యారమణీమణితోఁ బ్రసంగించి గెలిచి తద్రాజ్యలక్ష్మితోఁగూడ నాచేడియం బాణిగ్రహణము సేసికొనుఁడు. కావలసిన నాకుమారుని శంబరుఁడనువానిని మీకుఁ దోడుపంపెదనని యెఱింగించిన విని కుచుమారుండు మందహాస శోభితవదనారవిందుండై మహాత్మా ! బ్రాహ్మణాశీర్వాద మమోఘఁ మైనది అయ్యైశ్వర్యము నన్నందునట్లు దీవింపుఁడు. భాగ్యోదయంబు దైవాయత్తంబు. అందుఁబోయి ప్రయత్నించి చూచెద. సరస్వతినైనం గెలువఁగలనని నాకు ధైర్యము గలదు. అని పలికినవిని యుబ్బుచు నాయజమానుం డిట్లనియె.

కుచుమారా! నీయాకారతేజోవిశేషంబు లుపలక్షింప నీ యందుఁ బ్రభుత్వచిహ్నంబులు బొడకట్టుచున్నవి. నీవు తప్పక రాజపుత్రిక యిచ్చిన ప్రశ్నములకు సమాధానము చెప్పఁగలవు. ఆరాచపట్టిం జేపట్టఁగలవు. రాజ్యాధిపత్యము వహింతువుగాక యని యాశీర్వ